ఇరాన్‌లో ప్రాణాలు తీసిన 'కరోనా' వదంతులు..
By అంజి
ముఖ్యాంశాలు
- కరోనా వైరస్‌తో అతలాకుతలమవుతోన్న ఇరాన్
- నిన్న ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి
- ఇప్పటి వరకు ఇరాన్‌లో 237 మంది మృతి
- మరో 7 వేల మందికి సోకిన కరోనా వైరస్
ఇరాన్‌లో వదంతులు ప్రాణాలు తీశాయి. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో నాటుసారా తాగి 27 మంది మృత్యువాత పడ్డారు. మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే ఇరాన్ అతలాకుతలమవుతోంది. నిన్న ఒక్క రోజే కరోనా వైరస్ కారణంగా 43 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఇరాన్‌లో 237 మంది మృతి చెందగా, మరో 7 వేల మందికి కరోనా వైరస్ సోకింది. కాగా 70 వేల మంది ఖైదీలను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మద్యం బాగా పని చేస్తుందని గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం జరిగింది. దీంతో తమకు సోకిన కరోనాను వదిలించుకునేందుకు అధికస్థాయిలో మద్యం సేవించి మృతి చెందారు. మృతుల్లో 20 మంది ఖుజెస్థాన్‌కు చెందినవారు కాగా, మరో ఏడుగురు అల్బోరజ్ ప్రాంతావాసులను అధికారులు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వైరస్ పాకింది. ఇప్పటి రకు 4,009 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. కాగా 1,14,285 మంది వైరస్ బారిన పడ్డారు. ఇటలీలో నిన్న ఒక్క రోజే 97 మంది మృతి చెందగా, 1797 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇరాన్‌లో నిన్న 595 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా చైనాలో కరోనా వైరస్‌తో మరో 17 మంది మృతి చెందారు.
మరో వైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 46కు చేరుకున్నాయి. బెంగళూరు, పంజాబ్, పుణెలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన బెంగళూరు వాసికి, ఇటలీ నుంచి తిరిగొచ్చిన పంజాబ్ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిని ఐసోలేషన్ వార్డులకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మయన్మార్ బోర్డన్‌ను భారత ప్రభుత్వం మూసివేసింది.