ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారి సస్పెన్షన్

By Newsmeter.Network  Published on  18 Dec 2019 6:51 AM GMT
ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారి సస్పెన్షన్

ముఖ్యాంశాలు

  • ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారిపై భార్య ఫిర్యాదు
  • భర్త మోసం చేశాడని ఫిర్యాదు చేసిన భార్య
  • మానసికంగా, శారీరకంగా హింసించాడని ఫిర్యాదు
  • జవహర్ నగర్ పోలీస్టేషన్ లో నమోదైన కేసు
  • ఎంక్వయిరీకి ఆదేశించిన కేంద్ర హోంశాఖ
  • నివేదిక సమర్పించిన పోలీస్ అధికారులు
  • ప్రొబేషనరీ అధికారిని సస్పెండ్ చేసిన హోం శాఖ
  • ఉస్మానియా వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమ
  • ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్వర్ రెడ్డి, భావన
  • భర్త తనను వదిలేశాడని ఫిర్యాదు చేసిన భావన

హైదరాబాద్ : తన భర్త తనను మోసం చేశాడంటూ ఐ.పి.ఎస్ ప్రొబేషనరీ అధికారి కె.వి.మహేశ్వర్ రెడ్డి పై ఆయన భార్య బిరుదుల భావన చేసిన ఫిర్యాదు ఆధారంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ సదరు ఐ.పి.ఎస్ ప్రొబేషన్ అధికారిని సస్పెండ్ చేసింది.

మహేశ్వర్ రెడ్డికీ ఆయన భార్యకూ వచ్చిన స్పర్థల కారణంగా ఆ జంట విడిపోవడంతో అసలు సమస్య మొదలయ్యింది. వీరిద్దరూ హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నివాసులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కలసి చదువుకున్న రోజుల్లో ప్రేమలోపడ్డారు.

ప్రేమ వివాహంద్వారా ఒక్కటైన ఈ జంట తర్వాతికాలంలో స్పర్థల కారణంగా విడిపోయారు. తన భర్త తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్టేషన్ లో బిరుదుల భావన ఫిర్యాదు చేసింది. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దాని ఆధారంగా ఐ.పి.ఎస్ ప్రొబే్షనరీ అధికారి మహేశ్వర్ రెడ్డిపై ఐ.పి.ఎస్ 498A, 323, 506 సెక్షన్లపై కేసు నమోదయ్యింది.

బిరుదుల భావన తల్లిదండ్రులకు వీరి ప్రేమ వివాహం గురించి ముందే తెలుసని, మహేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులకు మాత్రం తెలియదని భావన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన కె.మహేశ్వర్ రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఐ.పి.ఎస్ పోస్టింగ్ సంపాదించుకున్నాడు. లాల్ బహద్దూర్ శాస్త్రి పోలీస్ అకాడమీలో శిక్షణకూడా పొందాడు.

బాధితురాలు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం ఆ సమయంలోనే దంపతులిద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. కె.మహేశ్వర్ రెడ్డి తనతో కలసి ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని బిరుదుల భావన జీర్ణించుకోలేకపోయింది. తరచూ వాళ్లిద్దరి మధ్యా ఘర్షణలుకూడా జరిగాయి. చివరికి భావన తన కుటుంబ సభ్యుల సలహాతో జవహర్ నగర్ పోలీస్టేషన్ లో తన భర్తపై ఫిర్యాదు చేయడంతో దానిపై ఉన్నతస్థాయి ఎంక్వైరీ జరిగింది.

దర్యాప్తు నివేదికపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ కె.మహేశ్వర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్న కారణంగా ఆయన్ని సస్పెండ్ చేస్తూ, నియామకాన్ని రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర్ రెడ్డి నియామకానికి సంబంధించికూడా పోలీస్ విచారణ జరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it