ఐపీఎల్‌-13వ సీజన్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2020 4:32 PM IST
ఐపీఎల్‌-13వ సీజన్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) పై కూడా పడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌ వాయిదా పడింది. ఏప్రిల్‌ 15 నుంచి ఐపీఎల్‌-13వ సీజన్‌ ఆరంభం అవుతుందని బీసీసీఐ ఓ ప్రకనటలో తెలిపింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే అన్ని ప్రాంచైజీలకు బీసీసీఐ అందించింది. ఇంతకముందు మార్చి 29 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కావాల్సి ఉంది.

భారత్‌లో కరోనా కేసులు 70కి పైగా నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ, దౌత్య మినహా అన్ని విభాగ వీసాలను ఏప్రిల్‌ 15 వరకు రద్దు చేసింది. దీంతో.. విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేదు. ఇప్పటికే ఐపీఎల్‌-13 సీజన్‌ను రద్దు చేయాలంటూ పలువురు కోర్టుల్ని ఆశ్రయించగా, ప్రేక్షకులు రాకుండా మ్యాచ్‌లు నిర్వహించాలనే కేంద్ర నిర్ణయం మరో కొత్త సమస్యను తీసుకొచ్చింది. మరొకవైపు పలు రాష్టాలు కూడా ఐపీఎల్‌ నిర్వహించడానికి సిద్ధంగా లేవు. మహరాష్ట్ర, హరియాణా, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే ఐపీఎల్‌కు సానుకూలంగా లేవు. దీంతో ఐపీఎల్‌ను వాయిదా వేయడమే ఉత్తమమని బీసీసీఐ బావించింది.

కాగా నేటి ఉదయం వరకు కూడా ఐపీఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. ప్రాంఛైజీలు కూడా అందుకు అంగీకరించాయని తెలిసింది. అయితే విదేశీ ఆటగాళ్లను మాత్రం ఖచ్చితంగా అనుమతించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. కరోనా వైరస్ ప్రభావం ఈ సిరీస్‌పైనా పడింది. దీంతో.. లక్నో వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డే, కోల్‌కతాలో బుధవారం జరగనున్న మూడో వన్డేకీ ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది.



Next Story