ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ 13వ సీజన్.. !
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 7:12 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్-2020 సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ముంబాయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. కాగా.. భారత్‌లో ఇప్పటి వరకు 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బీసీసీఐ సహా జాతీయ క్రీడా సమాఖ్యలకు పలు సూచనలు చేసింది. ఏప్రిల్ 15 వరకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ టోర్నీని వాయిదా లేదా రద్దు చేసే పరిస్థితులు తలెత్తాయి.
ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఇప్పటికే కేంద్రం ఆంక్షలు విధించింది. దీంతో విదేశీ ప్లేయర్స్ లేకుండా ఐపీఎల్ నిర్వహించాలని భావించినా.. ఇప్పుడు అభిమానులు కూడా అనుమతించొద్దని ఆదేశాలు రావడంతో ఐపీఎల్ పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి బీసీసీఐ దీనిపై అధికారికంగా స్పందించనప్పటికి.. శనివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశం వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించడంపై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ వాయిదా వేయడం లేదా రద్దు చేయడం కన్నా ఖాళీ స్డేడియాల్లో నిర్వహించడమే మంచిదని ప్రాంచైజీలు భావిస్తున్నట్లు సమాచారం. అభిమానులకు విక్రయించే టికెట్ల ఆదాయంలో ప్రాంచైజీలకు వాటా ఉంటుంది. ఐతే ఖాళీ స్టేడియాల వల్ల వచ్చే నష్టం తక్కువేనట. ఈ నష్టాలను భర్తీ చేసుకొనేందుకు భీమా సైతం ఉంటుంది. కానీ టోర్నీ పూర్తిగా రద్దైనా, వాయిదా వేసినా వచ్చే నష్టాలని భరించడం కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌కు అన్ని ప్రాంచైజీలు ఏర్పాట్లు చేసేసాయి.
క్రీడాపోటీలు వీక్షించేందుకు భారీగా జనాలు ఒక్కచోటకు చేరకుండా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటించాలని క్రికెట్ బోర్డు సహా జాతీయ క్రీడా సమాఖ్యలను క్రీడామంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏ క్రీడా పోటీల కోసమైనా భారీ జన సమూహాలు ఏర్పకుండా చూడాలి. ఒకవేళ క్రీడా పోటీలను వాయిదా లేదా రద్దు చేసే పరిస్థితులు లేకుంటే.. ఖాళీ స్టేడియంల్లో నిర్వహించాలి. అభిమానులను మాత్రం అనుమతించొద్దు. బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు పాటించాలని మేం కోరాం. జన సమీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాదేశ్యామ్ జులానియా వెల్లడించారు.
క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఐపీఎల్ పై నీలినిడలు కమ్ముకున్నాయి. ఐపీఎల్ ను వాయిదా వేస్తారా లేదా రద్దు చేస్తారా.. అలా కాకుండా ప్రాంఛైజీలు కోరినట్లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారా అన్నది తెలియాలి అంటే మరో రెండు రోజులు వేచిచూడక తప్పదు. శనివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.