మేడిన్ ఇండియా ఐఫోన్ 12.. మనకు తీసుకొచ్చే లాభాలెన్నంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 8:39 AM GMT
మేడిన్ ఇండియా ఐఫోన్ 12.. మనకు తీసుకొచ్చే లాభాలెన్నంటే?

ఒక సంస్థ తయారు చేసే ఫోన్ కొత్త వెర్షన్ కోసం.. రోడ్ల మీద క్యూలలో నిలచొని వాటిని సొంతం చేసుకోవటాన్ని ఊహించగలమా? కానీ.. అలాంటి మేజిక్ ను ఇప్పటికే ఎన్నోసార్లు నిజం చేసిన ఆపిల్ సంస్థ ఐఫోన్ తన లేటెస్ట్ వెర్షన్ 12 తయారీపై ఫోకస్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఐఫోన్ 12 మేడిన్ ఇండియా ట్యాగ్ తోడు కానుంది. ఇందులో భాగంగా భారత్ కు మరింత మేలు జరగనున్నట్లుగా చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఐఫోన్ 12 విడుదల కానున్నట్లు చెబుతున్నారు. అది కూడా మేడిన్ ఇండియా ముద్రణతో కావటం విశేషం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరానికి 70కి.మీ. దూరంలో ఉన్న కోలార్ లో ఆపిల్ ప్లాంట్ ను నెలకొల్పటం తెలిసిందే. దీనికి సంబంధించిన పనుల్ని విస్ట్రాన్ కంపెనీ చేపడుతోంది.

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు పదివేల మందికి కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అనుభవం ఉన్న వారితో పాటు.. ఫ్రెషర్స్ ను ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ఐఫోన్ 12 కాంపొనెట్స్ ట్రయల్ ప్రొడక్షన్ చేపట్టిన విస్ట్రాన్ కంపెనీ.. సెప్టెంబరు నుంచి కమర్షియల్ ఉత్పత్తిని స్టార్ట్ చేయనుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశీయంగా ఐఫోన్ 12నుతయారు చేస్తున్న కారణంగా దాదాపు 22 శాతం మేర దిగుమతి పన్నులు తగ్గనున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలుభారీగా లభించనున్నాయి.

ఇప్పటికే భారత్ లో ఐఫోన్ 6ఎస్.. 7.. ఎక్స్ ఆర్.. ఐఫోన్ 11ను దేశీయంగా ఉత్పత్తి చేసింది. తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 11ను చెన్నైలోని ప్లాంట్ లో తయారు చేసింది. ఐఫోన్ సంస్థ తాను తయారు చేసే ఫోన్లను ఒక్కొక్కటి ఒక్కో కంపెనీకి అప్పజెబుతుూ ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ 11ను ఫాక్స్ కాన్ కు అప్పజెబితే.. ఐఫోన్ 12ను దాని ప్రత్యర్థి కంపెనీ అయినా విస్ట్రాన్ కు అప్పజెప్పటం గమనార్హం. వ్యాపార సంబంధమైన విషయాల్ని పక్కన పెడితే.. ఐఫోన్ 12తో దేశీయంగా పదివేలకు పైగా ఉద్యోగాలు రావటం మాత్రం దేశానికి మేలు జరుగుతుందని చెప్పక తప్పదు.

Next Story