Nani Vs Chinni: 'మా అన్న టీడీపీకి ద్రోహం చేశారు'.. అని అంటున్న కేశినేని చిన్ని

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘కేశినేని’ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారోననే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 April 2024 3:24 AM GMT
Vijayawada, MP candidate, Junior Keshineni , TDP

Nani Vs Chinni: 'మా అన్న టీడీపీ ద్రోహం చేశాడు'.. విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్న జూనియర్ కేశినేని

విజయవాడ: విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘కేశినేని’ కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారోననే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసినేని శ్రీనివాస్ (నాని)పై కేశినేని శివనాథ్ (చిన్ని)ని పోటీకి దింపింది టీడీపీ. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందారు.

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:

విజయవాడ తూర్పు

విజయవాడ వెస్ట్

విజయవాడ సెంట్రల్

నందిగామ

జగ్గయ్యపేట

తిరువూరు

మైలవరం

జనవరిలో కేశినేని నాని వైఎస్‌ఆర్‌సీపీలోకి మారడంతో.. ఆయన సోదరుడు కేశినేని చిన్నికి వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా భావించే విజయవాడలో వ్యాపారంలో ఉన్న ఇద్దరు సోదరుల మధ్య వివాదం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

కేశినేని చిన్ని హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ కేశినేని డెవలపర్స్‌కు CEO. న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ఫ్రీవీలింగ్ ఇంటర్వ్యూలో, కేశినేని చిన్ని విజయవాడ అభివృద్ధికి తన ప్రణాళికలను, తన సోదరుడికి వ్యతిరేకంగా పోరాడడానికి గల కారణాలను పంచుకున్నారు.

NM: రెండుసార్లు ఎంపీగా గెలిచిన మీ సోదరుడు కేశినేని నానిని మీరు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల పోరులో ఆయనను ఎలా ఓడించబోతున్నారు?

చిన్ని: రాజకీయాల్లో మా అన్నతో పోటీ పడాలనే ఆకాంక్ష నాకు ఎప్పుడూ లేదు. టీడీపీకి దూరమైన ఆయన మహానాడు సహా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏనాడూ పట్టించుకోలేదు. టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు నానికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు. నాని టీడీపీ నాయకత్వానికి అండగా నిలవాల్సి ఉండేది.. అలాంటిది చంద్రబాబు నాయుడుపై, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై బురదజల్లడం మొదలుపెట్టారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. టీడీపీ నాయకత్వం పట్ల కేశినేని నాని మొండి వైఖరి ప్రజలకు తెలిసిందే. నేను చేపట్టిన సేవా కార్యకలాపాలు, ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ఎన్నికల పోరులో నా సోదరుడిని ఓడించడానికి నా వ్యూహాలు ఇవే.

NM: టీడీపీ క్యాడర్ మీకు మద్దతు ఇస్తోందా? మీ ప్రధాన బలం ఏమిటి?

చిన్ని: ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా.. టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ. టీడీపీ ఎన్నికలలో ఓటమిని ఎదుర్కొన్న ప్రతిసారీ, క్యాడర్ మద్దతుతో తిరిగి పుంజుకుంది. మా అన్న వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళిపోయినా.. విజయవాడలోని పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలంతా నాకు మద్దతుగా నిలిచారు. టీడీపీ నాయకత్వం, క్యాడర్ నా ప్రధాన బలమని భావిస్తున్నాను. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నియోజకవర్గంలో ఎంతో సేవ చేశాను.

మేము ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో మొబైల్ అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేసాము. ఇవి ప్రతిరోజూ 2,000 మందికి పైగా ఆహారం అందిస్తున్నాయి. డయాలసిస్ రోగులకు వైద్య శిబిరాలు, రోగులకు ఉచిత మందులు అందించడంలో బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ ప్రమేయం కూడా ఉంది. అంతేకాకుండా, విద్యావంతులైన యువతకు విజయవాడలోని లాజిస్టిక్ కంపెనీలు, హైదరాబాద్, బెంగళూరు కంపెనీలతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించాం.

NM: 2019 ఎన్నికల్లో మీరు మీ సోదరుడు కేశినేని నానికి మద్దతు ఇచ్చారు. మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి?

చిన్ని: టీడీపీ, చంద్రబాబు నాయుడులతో మా కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా లాభపడింది. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో మా తాత కేశినేని వెంకయ్య చౌదరి ఒకరు. నా సోదరుడు కేశినేని నాని 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుని చాలా విమర్శించారు. ఆయనతో అవమానకరంగా ప్రవర్తించారు. వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి కోవర్టు ఆపరేషన్‌ చేస్తూ రాష్ట్రంలోని టీడీపీ నేతలను, కార్యకర్తలను నా సోదరుడు అవమానించాడు. కేశినేని నాని వెంట తిరగడం ఆపేసి.. నాయుడు గారి డైరెక్షన్‌లో పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించుకున్నాను. టీడీపీ అధ్యక్షుడు నా సామర్థ్యాలను గుర్తించి పార్టీ కంచుకోటలా భావించే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి నన్ను ఎంపీగా నామినేట్ చేయాలని నిర్ణయించారు.

NM: మీ రాజకీయ ప్రవేశం వల్ల కేశినేని నాని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాల్సి వచ్చిందంటూ మీపై చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు? మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుందా?

చిన్ని: 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్న రెండోసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆయన కూతురు కేశినేని శ్వేత కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వారికి అండగా నిలిచిన వ్యక్తిని నేనే. రెండోసారి ఎంపీగా గెలిచిన కేశినేని నాని వైఎస్సార్‌సీపీ నుంచి లబ్ధి పొందడంతో నాయుడుపై తిరుగుబాటు చేశారు. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం మా అన్నకు చాలా కష్టమైన పనిగా మారింది. చంద్రబాబు నాయుడుని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి నా కుటుంబం మొత్తం కట్టుబడి ఉంది.

NM: 2019 ఎన్నికల్లో ఆరుగురు YSRCP ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా విజయవాడ లోక్‌సభ సీటును టీడీపీ గెలుచుకుంది.. ఇప్పుడు ఎలా ఉండబోతోంది?

చిన్ని: నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్‌, విజయవాడ ప్రజలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై విసిగి వేసారిపోయారు. నిరుద్యోగం అధికంగా ఉంది. గత ఐదేళ్లలో వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. విజయవాడలో చాలా మంది వ్యక్తులు రోజువారీ కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు.

విజయవాడకు సమీపంలో ఉన్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నిలిపివేయడం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి మరో అంశం. అనేక పరిశ్రమలు ప్రభావితమయ్యాయి, నిర్మాణ కార్మికులు, హమాలీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. రాబోయే ఎన్నికలలో టీడీపీ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం, నేను అధిక మెజారిటీతో పార్లమెంట్ కు ఎన్నిక కావడం ఖాయం.

NM: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో టీడీపీ-జనసేన పొత్తుకు మైనారిటీలు మద్దతు ఇస్తారని మీరు భావిస్తున్నారా? టీడీపీకి సవాళ్లు, ప్రయోజనాలు ఉన్నాయా?

చిన్ని: టీడీపీ ఎప్పుడూ సెక్యులర్ పార్టీగానే ఉంది. అంతకుముందు 2014లోనూ, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మేం ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా మైనారిటీల హక్కులను కాపాడాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది టీడీపీ సెక్యులర్ పార్టీగానే భావిస్తున్నారు. బీజేపీని మతతత్వ పార్టీ అని నేను అనుకోవడం లేదు, టీడీపీ మైనారిటీల హక్కులను కాపాడుతుందని ప్రజలకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా అంతిమ లక్ష్యం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడానికి, అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు NDA మద్దతు చాలా అవసరం. అందుకే టీడీపీ ఎన్డీయేలో చేరింది. ఇప్పుడు కూడా ఎన్డీయేతోనే ఉన్నాం, మైనార్టీల హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోం.

NM: విజయవాడ అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?

చిన్ని: టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వానికి విజయవాడ అభివృద్ధే ప్రధానం. అసంఘటిత రంగం, భవన నిర్మాణ కార్మికులు, ఆటోమొబైల్ పరిశ్రమ, వారి జీవన పరిస్థితులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జవహర్ ఆటో నగర్, ఆసియాలో అతిపెద్ద వాటిలో ఒకటి, దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. పరిశ్రమల్లో సాంకేతిక పురోగతులతో పాటూ.. శ్రామిక శక్తి ఉండాలంటే, కార్మికుల నైపుణ్యం పెంపుదల చాలా అవసరం. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను పరిశీలిస్తున్నాము. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి ఎద్దడి వంటి సమస్యలను రూపు మాపడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.

Next Story