నర్సుగా చేసిన సేవలకు గుర్తింపుగా.. నైటింగేల్ అవార్డు అందుకున్న సుశీలతో స్పెషల్ ఇంటర్వ్యూ
వైద్య రంగంలో విశిష్ట సేవలందించే నర్సులు, నర్సింగ్ వృత్తిలోనివారికి ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు (ఎన్ఎఫ్ఎన్ఏ) తెలంగాణకు
By అంజి Published on 25 Jun 2023 6:01 AM GMTనర్సుగా చేసిన సేవలకు గుర్తింపుగా.. నైటింగేల్ అవార్డు అందుకున్న సుశీలతో స్పెషల్ ఇంటర్వ్యూ
వైద్య రంగంలో విశిష్ట సేవలందించే నర్సులు, నర్సింగ్ వృత్తిలోనివారికి ఇచ్చే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు (ఎన్ఎఫ్ఎన్ఏ) తెలంగాణకు చెందిన తేజావత్ సుశీల అందుకున్నారు. ఎన్ఎఫ్ఎన్ఏ 2022, 2023కు గాను దేశవ్యాప్తంగా 30 మందికి అవార్డులు ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రోగ్రామ్‌లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సుశీల అవార్డును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుట్ట పీహెచ్సీలో సుశీల ఏఎన్ఎంగా పని చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గొత్తికోయల ఆవాసాలకు వెళ్లి అందిస్తోన్న సేవలకుగానూ ఈ అవార్డు వరించింది. నర్సింగ్ సేవలకుగాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి సుశీల. ఈ సందర్భంగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న సుశీలను న్యూస్‌మీటర్ తెలుగు స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..
1: జాతీయ స్థాయిలో ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డ్‌కు ఎంపికవడం పట్ల ఎలా ఫీలయ్యారు.?
సమాధానం: జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకోవడం పట్ల నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న నేను.. హైదరాబాద్‌కు వచ్చి పెద్ద ఆఫీసర్‌ని కలవడమే నాకు గొప్పగా అనిపించేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది.
2. మహిళా రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోవడాన్ని ఎలా భావిస్తున్నారు.?
సమాధానం: ఇప్పుడంటే మేల్ నర్సులు వస్తున్నారు. మొదట్లో 99 శాతం ఫీమేల్ నర్సులు మాత్రమే ఉండేవారు. ఒక మహిళ రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకోవడం పట్ల.. ఒక మహిళగా చాలా సంతోషపడుతున్నాను. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. గిరిజనులని కాకుండా.. మనం చేసే పని 100 శాతం చేయగలిగితే తప్పకుండా దానిని పైస్థాయిలో చూడొచ్చు. రాష్ట్రపతి ముర్ము మా అందరికీ ఒక రోల్ మోడల్.
3. అవార్డ్‌కు ఎంపికవడంతో.. రాష్ట్రంలోనే ఉత్తమ ఏఎన్ఎంగా గుర్తింపు వచ్చింది.. మీ తోటి ఏఎన్ఎంల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది.?
సమాధానం: అవార్డు వచ్చిందని తెలిసి.. నా తోటి ఏఎన్‌ఎంలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అది కూడా అవార్డు నాకు రావడం పట్ల. నాకు 26 సంవత్సరాల సర్వీసు ఉంది. ఈ సర్వీసులో మా జిల్లాలోని ఎంతో మంది ఏఎన్‌ఎంలతో పరిచయం ఉంది. మేం అందరం రకరకాల మీటింగ్‌లలో కలుస్తూ ఉంటాం. అలా అప్పటి నుంచి నేను వారికి తెలుసు. వాళ్లకి ఎలాంటి డౌట్లు వచ్చినా నన్ను అక్కా అని పిలుస్తూ అడిగేవారు. నేను వారి డౌట్లు క్లియర్ చేసేదానిని. ఇప్పుడు నాకు అవార్డు రావడం.. వారందరికీ వచ్చినంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు.
4. అవార్డ్‌కు ఎంపికయ్యాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి.? పై అధికారులు ఎలా స్పందించారు.? కుటుంబ సభ్యులు ఎలా రియాక్టయ్యారు.?
సమాధానం: నాకు మా మెడికల్ ఆఫీసర్ ప్రియాంక నుండి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఆ రోజు నేను రిలీవింగ్ ఆర్డర్ కోసం పీహెచ్‌సీకి వెళ్లాల్సి ఉండే.. డీఎంహెచ్‌వో హైదరాబాద్‌లో ఉండటంతో మెడికల్ ఆఫీసరే డైరెక్టుగా మా ఇంటికి వచ్చారు. నాకు రిలీవింగ్ ఆర్డర్‌తో పాటు.. బోకే ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారు. పై అధికారులతో పాటు నాతోటి ఏఎన్‌ఏంలు అందరం ఒక టీమ్‌గా పని చేశాం. ఎర్రగుంట పీహెచ్‌సీ పరిధిలోని మద్దుకూరులో నా సెకండ్ ఏఎన్‌ఎం, సూపర్ వైజర్స్, ఇలా ప్రతీ ఒక్కరూ.. నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించారు. స్టేట్ లెవెల్‌లో ఈ మధ్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రివ్యూస్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఆశా వర్కర్లతో మాట్లాడి, మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. దాంతో మేం ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. నాపై స్థాయి అధికారి నుండి కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ నాకు అవార్డు రావడం పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నాం.
5. ఖమ్మం ఏజెన్సీ జిల్లా కేంద్రం.. 1996 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.. మణుగూర్, సుజాతనగర్, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పనిచేశారు. తొలినాళ్లలో గొత్తికోయ గ్రామాలు ఎక్కువున్న, సింగరేణి ప్రాంతమైన మణుగూర్ లో పనిచేశారు. అక్కడ మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి.?
సమాధానం: నేను విధుల్లో జాయిన్ అయిన మొదట్లో సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. గ్రామాలకు ఆటోలు కానీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కానీ అంతగా ఉండేది కాదు. మేమే గ్రామాల్లోకి వెళ్లి, అక్కడున్న రోగులకు చిన్న ట్రీట్మెంట్ చేసేవాళ్లం. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే మాత్రమే ఆస్పత్రికి రిఫర్ చేసేవాళ్లం. అప్పటికి ఇప్పటికి పరిస్థితి చాలా మారింది. ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీస్ బాగా మెరుగయ్యాయి. ఎమర్జెన్సీ సమయాల్లో 108 వాహనాల్లో గర్భిణీలను, ఇతర రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లడం జరుగుతోంది. ప్రతి సోమవారం హెల్త్ చెకప్‌లు, కేసీఆర్ న్యూట్రీషన్ కిట్స్ వంటివి మా డిపార్ట్‌మెంట్ నుంచి పబ్లిక్‌ను ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. ఆరోగ్య విషయమై గతంతో పొలిస్తే ఇప్పుడు గ్రామాల ప్రజలు బాగా విని అర్థం చేసుకుంటున్నారు. మొదట్లో కొంచెం ఇబ్బంది ఉండేది.
6. ఏజెన్సీ ప్రాంతం.. వర్షాకాలంలో రోడ్లు సరిగా ఉండవు, అడువులు, వాగులు, వంకలు.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ఎలా మీ సేవలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు..?
సమాధానం: సాధారణంగా ఎండాకాలంలో ప్రజలు ఆస్పత్రికి రావడానికి అవకాశం ఉండేది. కానీ వర్షం కాలంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేవారు. నీటి కాల్వలు అడ్డురావడం, నీరు పెద్ద మొత్తంలో ఉండి బురద గుంటలు ఉండటం, అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీలు ఉండదు. అలాంటి సమయాల్లో మేం గ్రామాల్లోకి విధులు నిర్వర్తించడం మాకు పెద్ద టాస్క్‌గా ఉండేది. ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే అక్కడ వాళ్లు ఏ కండీషన్‌లో ఉన్నారో తెలిసేది కాదు. వర్షకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కనీసం 10 రోజులకు ఒకసారైన గ్రామానికి వెళ్లి ఎవరికైనా ఫీవర్స్, డయేరియా ఉందా?, క్రిటికల్ కండీషన్స్ ఉన్నాయా? అని చెక్ చేసేవాళ్లం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తడబడకుండా తమ సేవలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లే వాళ్లం.
7. 24 ఏళ్ల సర్వీస్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉద్యోగి, 26 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయి అవార్డ్.. మీకు గుర్తింపు రావడానికి రెండు దశాబ్ధాలకు పైగా సమయం పట్టిందని ఎప్పుడైనా నిరుత్సాహానికి లోనయ్యారా..?
సమాధానం: నేనెప్పుడు నిరుత్సాహనికి లోనుకాలేదు. అవార్డులు వస్తాయి, అధికారులు మెచ్చుకుంటారన్న ఉద్దేశ్యంతో నేను ఏప్పుడూ పనిచేయలేదు. మనం కష్టపడి పని చేస్తే ఎదో ఒక రోజు తప్పకుండా గుర్తింపు వస్తుంది. దాని కంటే ఓపికతో, ప్రేమతో మనం చేసే సేవ ఎంతో ఆనందాన్నిస్తుంది. మనం చేసిన సేవను గుర్తుంచుకుని మన పట్ల వారు చూపే ప్రేమను చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది.
8. మీ 26 ఏళ్ల సర్వీస్‌లో మీరందించిన సేవలలో మీకు బాగా గుర్తిండిపోయే, బాగా సంతృప్తినిచ్చిన సంఘటన ఏది..?
సమాధానం: సంతృప్తినిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కోవిడ్ సమయంలో మా జాబ్ చాలా టఫ్‌గా ఉండేది. కఠినమైన పరిస్థితుల్లో అన్ని డిపార్ట్‌మెంట్ల కంటే ఎక్కువగా పని చేశాం. రోజులో దగ్గరదగ్గర 200 కాల్స్ అటెంప్ట్ చేసేవాళ్లం. ప్రతీ కాల్ కూడా మాకు ఇంపార్టెంటే. ఎందుకంటే వారు ఏ కండీషన్‌లో ఉండి కాల్ చేస్తున్నారో తెలియదు కదా. అందుకే ప్రతీ కాల్‌ను అటెంప్ట్ చేసేవాళ్లం. అది ఉదయమా, రాత్రా అనే తేడా లేకుండా, టైంతో పని లేకుండా పని చేశాం. అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఆ సమయంలోనే నా విధుల పట్ల మరింత విజయం సాధించాను. నేను విధులు నిర్వర్తించిన మూడు గ్రామాల్లో ఏ ఒక్కరూ కూడా కరోనా బారిన పడి చనిపోలేదు.
9. మీ 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో మీరు మరిచిపోలేని, మీకు మచ్చగా మిగిలిపోయిన బాధకరమైన ఘటనలేమైనా ఉన్నాయా.?
సమాధానం: మాయని మచ్చగా మిగిలిన బాధకరమైన ఘటనలంటూ నా జీవితంలో పెద్దగా ఏమీ లేవు. కోవిడ్ సమయంలో నా తోటి ఆశా వర్కర్ తండ్రి కరోనా బారిన పడ్డారు. అతడిని ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించాం.. కానీ ఐదు రోజులు ఆస్పత్రిలో చికిత్స ఆయన పొందుతూ మరణించారు. అప్పుడు చాలా బాధపడ్డాం. ఆ బాధను దిగమింగుకుని మా సర్వీసును కంటిన్యూ చేశాం. కరోనా సమయంలో మా సోదరుడిని కోల్పోయాం.. ఈ ఘటనలు చాలా బాధ కలిగించాయి.
10. కొత్తగా ఏఎన్ఎం వృత్తిని ఎంచుకునేవారికి మీరు ఏం సలహాలిస్తారు..?
సమాధానం: సలహాలు ఇచ్చేంతా స్టేజ్‌లో నేను లేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా గ్రామంలో ఒక చిన్నస్థాయి ఏఎన్‌ఎంగా వచ్చాను. ఈ వృత్తిలోకి ఎవరూ వచ్చినా కష్టపడి పని చేయాలి. ఏ పని చేసినా 100 శాతం చేయాలి.. అప్పుడు రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. దాంతో గుర్తింపు వస్తుంది. అధికారులు తమను గుర్తించడం లేదని ఎప్పుడూ బాధపడకూడదు. మన చేసిన మంచి పనిని, మన ప్రతిభని ఎదో ఒక రోజు అందరూ గుర్తిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలి, వర్క్ చేయాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి.. ఇవే కొత్తగా ఏఎన్ఎం వృత్తిని ఎంచుకునేవారికి నేను ఇచ్చే సలహాలు.
11. ఎంత వరకూ చదువుకున్నారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి..?
సమాధానం: మాది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. మా తండ్రి పేరు తేజావత్ సోమ్లా. నాన్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో చిన్న ఉద్యోగి. మా తల్లి పేరు కాంతమ్మ. ఇంటి పనులు చూసుకునేవారు. నాకు ఇద్దరూ సోదరులు. పెద్దన్నయ్య ఓ కాలేజ్‌లో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న ఉద్యోగం మా తమ్ముడికి వచ్చింది. ప్రస్తుతం అందరూ సెటిల్డ్‌గా ఉన్నారు. నా భర్త పేరు ప్రభాకర్ రావు.. గతంలో మణుగూరులో ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఇప్పుడు మాకు ఉన్న సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. నాకు ఇద్దరు పిల్లలు.
12. ఉద్యోగ విరమణ అయ్యే లోపు వృత్తిరీత్యా మీరు నెరవేర్చాలనుకున్న బాధ్యతలు ఏమైనా ఉన్నాయా?
సమాధానం: నాకు గ్రీన్ ఇంక్‌తో ఉద్యోగ విరమణ చేయాలని కోరిక ఉంది. మా డిపార్ట్‌మెంట్‌లో ఏఎన్‌ఎంలకు ప్రమోషన్స్ వస్తే.. కమ్యూనిటీ ఆఫీసర్ వంటిపై పోజిషన్ వరకూ వెళ్లొచ్చు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా.. గెజిటెడ్ ర్యాంక్ అధికారులు ఉంటారు. నేను 26 ఏళ్ల నుంచి ఏఎన్‌ఎంగానే విధులు నిర్వర్తిస్తున్నాను. ఏఎన్‌ఎంల ముందు హెల్త్ సూపర్‌వైజర్లు, వారికి ముందు పబ్లిక్ హెల్త్ నర్సు, వారిపై సీహెచ్‌వో (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లు ఉంటారు. ఉద్యోగ విరమణ అయ్యేలోపు గ్రీన్‌ఇంక్ చేత పట్టుకోవాలని చిన్న ఆశ ఉంది.