38 ఏళ్ల త‌రువాత బ‌ద్ద‌లైన మౌనా లోవా అగ్నిపర్వతం

World's largest active volcano erupts in Hawaii.ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన మౌనా లోవా అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 11:53 AM IST
38 ఏళ్ల త‌రువాత బ‌ద్ద‌లైన మౌనా లోవా అగ్నిపర్వతం

ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన మౌనా లోవా అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైంది. హ‌వాయి బిగ్ ఐలాండ్‌లో గ‌ల ఈ అగ్నిప‌ర్వ‌తం 38 ఏళ్ల త‌రువాత సోమ‌వారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో బ‌ద్ద‌లైంది. ఈ అగ్నిప‌ర్వ‌తం నుంచి ఎరుపు రంగులోని లావా బ‌య‌ట‌కు వ‌స్తోంది. అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన స‌మ‌యంలో హవాయి కౌంటీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. కాసేప‌టి త‌రువాత ప్ర‌స్తుతానికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, లావా ప్ర‌వాహం కొండ ప్రాంతంలోనే ఉంద‌ని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదంటూ అల‌ర్ట్‌ను ఉప‌సంహ‌రించుకుంది.

అల‌ర్ట్ కార‌ణంగా మూడు గంట‌ల పాటు కైలువా, ఓల్డ్ కోనా విమానాశ్ర‌యంలో సేవ‌లు నిలిచిపోయాయి. త‌రువాత వాటిని పున‌రుద్ద‌రించారు. 1984, న‌వంబ‌ర్ 27 త‌రువాత ఈ అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లు ఇవ్వ‌డం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇక లావా ప్ర‌వాహం క్ర‌మంగా పెరుగుతున్న‌ట్లు గుర్తించారు. జ‌నాభా ఉన్న ప్రాంతాల‌కు లావా చేరేందుకు వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా హ‌వాయి వొల్క‌నో అబ్జ‌ర్వేటరీ సంస్థ ఆ ప్రాంతంలో ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ అగ్నిప‌ర్వ‌తం స‌ముద్ర మ‌ట్టానికి 13,796 అడుగు ఎత్తులో ఉంది. ఈ అగ్నిప‌ర్వ‌తం విస్ఫోటనానికి ముందు రోజుల్లో మౌనా లోవా చుట్టూ భూకంపాలు పెరిగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి.

Next Story