ప్రపంచం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్న WHO చీఫ్
World in very dangerous period as Delta variant continues to mutate warns.ప్రపంచంలో కరోనా మహమ్మారి
By తోట వంశీ కుమార్
ప్రపంచంలో కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! అందుకు కారణం వ్యాక్సిన్లు.. ధనిక దేశాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను కొని తమ పౌరులకు వేయించేస్తూ ఉన్నాయి. అయితే కొత్త వేరియంట్లు మాత్రం ఎప్పటికప్పుడు టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. అంతేకాకుండా పేద దేశాల్లో వ్యాక్సినేషన్ సరిగా జరగకుండా పోతుండడం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థను కలవరపెడుతూ ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసన్ తాజాగా సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కరోనా మహమ్మారితో ప్రపంచం 'ప్రమాదకరమైన దశ'లో ఉందని అన్నారు. కరోనా వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఉండడంతో రాబోయే కాలంలో మరింత ముప్పు పొంచి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. డెల్టా లాంటి వేరియంట్లు నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్కువ జనాభాకు టీకాలు వేసిన దేశాల్లో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య మళ్లీ పెరగడంపై ప్రారంభమైందని.. మహమ్మారి నుండి ఇప్పటికీ ఇంకా ఏ దేశం ప్రమాదం నుంచి బయట పడలేదని అన్నారు. డెల్టా వేరియంట్‌ను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. కఠినమైన నిఘా, ప్రారంభంలో వ్యాధిని గుర్తించడం, ఐసోలేషన్ వంటివి ముఖ్యం.. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాలను నివారించడం, ఇళ్లలో వెంటిలేషన్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని టెడ్రోస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి కొవిడ్ టీకాలు వేసేలా చూడాలని ప్రపంచ నేతలను కోరారు. తక్కువ టీకాలు వేసిన దేశాల్లో వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.