ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ ప్రభావం.. డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు
World health organization Key Comments on Omicron.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2022 5:39 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో రోజువారి కేసుల సంఖ్య 10 లక్షలు దాటుతుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 128 దేశాలకు వ్యాపించినట్లు చెప్పింది. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ తెలిపారు.
ఇక తొలిసారి ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో ఆస్పత్రి పాలైన, మరణించిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అయితే.. అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంటుందని చెప్పలేమని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీని ప్రభావం ఉంటుందన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి ఎక్కువగా కనిపింస్తోందన్నారు. ఇందుకు అమెరికానే ఉదాహారణగా చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్నారు.
ఇంకా దీనిపై పూర్తి అవగాహాన రావాలంటే మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఇన్‌ఫెక్షన్లు ఉన్న దేశాలలో ఎక్కువ కాలం ఐసోలేషన్‌తో వీలైనంత తక్కువ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. టీకా తీసుకోని వారిలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతున్నారు. డెన్మార్క్‌లో ఆల్ఫా వేరియంట్ కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి రెండు వారాల సమయం పట్టిందని.. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేవలం రెండు రోజుల్లోనే విస్తరించిందని చెప్పారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.