సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ వార్నింగ్‌

అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2023 10:50 AM IST
World Bank, Warns, Pakistan, crisis,

సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ వార్నింగ్‌

పాకిస్థాన్‌ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్‌ దేశం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

పాకిస్థాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయం వ్యక్తం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు నెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్‌ బ్యాంకు పాక్‌ ప్రతినిధి నజీ బాన్‌ హాస్సిన్ అన్నారు. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాకిస్థాన్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య పాకిస్తాన్‌ సగటు తలసరి వృద్ధి రేటు 1.7 శాతం మాత్రమే ఉందని.. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని వెల్లడించారు. మానవాభివృద్ధి రేటు కూడా దక్షిణాసియాలో పాక్‌ స్థానం చిట్ట చివరన ఉందని తెలిపారు.

కాగా.. పాకిస్థాన్‌లో వచ్చే జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించింది. దేశ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం.. ఆర్థికాభివృద్ధి కోసం ఆలోచించాలని పేర్కొంది. ఉచిత హామీలను ఇవ్వకుండా.. నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ సూచనలు చేసింది. అంతేకాకుండా వృధా ఖర్చులను తగ్గించుకుంటే మంచిదని తెలిపింది.

Next Story