అమెరికాను వ‌ణికిస్తోన్న మంచు తుఫాను.. 15ల‌క్ష‌ల ఇళ్లు అంధ‌కారంలో

Winter Storm Knocks Out Power For 1.5 Million.అగ్ర‌రాజ్యం అమెరికాను మంచు తుఫాను వ‌ణికిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 11:51 AM IST
అమెరికాను వ‌ణికిస్తోన్న మంచు తుఫాను.. 15ల‌క్ష‌ల ఇళ్లు అంధ‌కారంలో

అగ్ర‌రాజ్యం అమెరికాను మంచు తుఫాను వ‌ణికిస్తోంది. భారీగా మంచు కుర‌వ‌డంతో పాటు చ‌లిగాలుల‌కు ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయాయి. దీంతో గ‌త నాలుగు ద‌శాబ్దాల‌లో ఎన్న‌డూ చూడ‌ని క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు అక్క‌డ న‌మోదు అవుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సెల‌వుల సీజ‌న్‌లో ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే బందీలుగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో జ‌నజీవ‌నం అస్త‌వ్య‌స్త‌మైంది. 15 ల‌క్ష‌ల ఇళ్లు, వ్యాపార సంస్థ‌ల‌పై ఈ తుఫాను ప్ర‌భావం ప‌డింది.

శుక్రవారం యునైటెడ్ స్టేట్స్ యొక్క పశ్చిమ రాష్ట్రం మోంటానాలో -45డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. డెస్ మోయిన్స్, అయోవా వంటి ప్రదేశాలలో -37°F (-38°C) ల‌కు ప‌డిపోయింది. ఇక్కడ ఓ ఐదు నిమిషాలు బ‌య‌ట ఉంటే చాలు గ‌డ్డ కట్టిపోవ‌డం ఖాయం. అమెరికా వ్యాప్తంగా 20 కోట్ల మంది ప్ర‌జ‌లు మంచు తుఫాను కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేల‌పై భారీగా మంచు పేరుకుపోవ‌డంతో వాటిని మూసివేశారు. ప్ర‌జ‌లు క్రిస్మిస్ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

నూయార్క్ లో అత్యవసర పరిస్థితి విధించారు. తూర్పు ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలులకు వృక్షాలు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. శుక్ర‌వారం ఒక్క రోజే 5 వేల విమానాలు ర‌ద్దు అయ్యాయి. మ‌రో 7,600 విమానాలు ఆల‌స్యంగా న‌డిచాయి. తుఫాను కార‌ణంగా 13 మంది మ‌ర‌ణించారు. మంచు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు.

Next Story