రేపు కీలకమయిన మ్యాచ్, గెలిచేదెవరు?

By Nellutla Kavitha  Published on  5 March 2022 3:07 PM GMT
రేపు కీలకమయిన మ్యాచ్, గెలిచేదెవరు?

చిరకాల ప్రత్యర్ధులు, దాయాది దేశాలు ఇటువంటి మాటలు అక్కడ వినిపించవు. రెండు జట్ల మధ్య యుద్ధం లాంటివి వర్ణన అక్కడ అసలే కనిపించదు. ఇవేవీ లేకుండానే రేపు ఉదయం భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ న్యూజిలాండ్ లో జరగబోతోంది. క్రికెట్ మ్యాచ్ అంటే అందులోనూ ఈ రెండు దేశాల మధ్య ఉంది అంటే ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ రేపు ఉదయం జరగబోయే మ్యాచ్ గురించి పెద్దగా ప్రచారం, వార్తలు కనిపించట్లేదు కారణం రేపటి మ్యాచ్ మహిళల మధ్య జరగబోతుంది. 12వ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్ - పాకిస్థాన్ మహిళా జట్లు రేపు తెల్లవారుఝామున తలపడుతున్నాయి. ఈ రెండు జట్లూ ఆడిన 10 వన్డేల్లో అన్నిట్లో భారత మహిళా జట్టు పాకిస్తాన్ పై గెలిచింది. మొత్తం 11 టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడితే ఒక్కటి మాత్రమే ఓడింది భారత్ మహిళా టీం. ఇక భారత్ పాక్ మహిళా క్రికెట్ జట్లు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్లో మహిళా క్రికెట్ అధికారికంగా 1970ల మొదట్లో ప్రారంభమైంది, ఆ తర్వాత రెండు దశాబ్దాలకు పాకిస్థాన్ మహిళా క్రికెట్ మొదలైంది. భారత్ - పాకిస్థాన్ పురుషుల జట్ల లాగే మహిళా జట్లు కూడా icc తో పాటుగా ఇతర ఖండాంతర ఈవెంట్స్ లో పాల్గొంటాయి. అయితే పురుషుల మ్యాచ్ కు వచ్చిన ప్రోత్సాహం ప్రేక్షకుల నుంచి, స్పాన్సరర్ల రూపంలో మహిళా మ్యాచ్ కు పెద్దగా కనిపించదు. 2017 ఉమెన్స్ వరల్డ్ కప్ లో లార్డ్స్ లో ఫైనల్ వరకు వెళ్ళిన భారత్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో నలభై వన్డే ఇంటర్నేషనల్ ఆడిన భారత్ 19 మ్యాచ్ లు గెలిచి, 21 ఓడిపోయింది. మరోవైపు 34 మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ 14 గెలిస్తే, 21 ఓడిపోయింది. తాజా ఐసిసి ర్యాంకింగ్స్ లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ ఎనిమిదవ స్థానంలో ఉంది. అయినప్పటికీ పాకిస్థాన్ కి ఉన్నట్లు BCCI లో ఉమెన్స్ వింగ్ భారత్ కి లేదు. ఇక ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహిస్తామని హామీ ఇచ్చింది, త్వరలో ప్రారంభం అవుతుందని సెక్రెటరీ ప్రకటించారు. ఆసక్తికరంగా ఉండబోయే ఈ మ్యాచ్ లో గత ఆదివారం వామప్ మ్యాచ్ లో గాయపడిన ఇండియన్ బ్యాటర్ స్మృతి మందన కోలుకొని ఆడ బోతున్నారు. మరోవైపు స్పిన్ బౌలర్ అయినా పాకిస్థాన్ కెప్టెన్ బిస్మ మరూఫ్ మెటర్నటీ లీవ్ ముగించుకొని తన ఆరు నెలల పాప తో ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు.

Next Story
Share it