ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేం.. ఒమిక్రాన్ ప్రాణాంతకమే
WHO warns Omicron is killing people and should not be called mild.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 6:54 AM GMTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్‌ను తేలికగా తీసుకుంటున్నాయి. వ్యాధి తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అంత పెద్ద ప్రమాదకారి కాదని కొట్టిపారేయకూడదని హెచ్చరించింది. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని డబ్ల్యుహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ చెప్పారు.
'డెల్టాతో పోలిస్తే శరవేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. అయితే.. టీకా తీసుకున్న వారిలో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా కనిపిస్తుంది. అంతమాత్రాన దీన్ని తేలిక పాటిదిగా పరిగణించడం సరైంది కాదు. మరోవేపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ బాధితులు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. చనిపోతున్నారు కూడా. నిజం చెప్పాలంటే కేసులు సునామీలా విరుచుకుపడుతుంది.' అని టెడ్రోస్ అధానమ్ అన్నారు.
మనం వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. టీకా కేవలం రక్షణ వలయంలాంటిదని చెప్పుకొచ్చారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని.. పలు దేశాలు కరోనా పరీక్షలు నిర్వహించడంతో విఫలంకావడంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఇక టీకాల పంపణీలో అసమానతల వల్లే ఎన్నో ప్రాణాలు మహమ్మారికి బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలకు కనీస వ్యాక్సిన్(ఒక్క డోసు ఇవ్వకుండా) కొన్ని దేశాలు తమ ప్రజలకు బూస్టర్ మీద బూస్టర్ డోసులు ఇచ్చినంత మాత్రాన కరోనాను అంతం చేయలేమన్నారు. టీకాలు పంచుకోవడంలో సమతుల్యం పాటించాలన్నారు. ఇక 2022 సంవత్సరం మధ్య నాటికి ప్రతి దేశం కనీసం 70 శాతం ప్రజలకు టీకాలను అందించాలని సూచించారు.
కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కరోనా వైరస్ చివరి వేరియెంట్ కాదన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వేరియంట్‌లు వస్తాయో ఊహించలేమన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 30 కోట్లు దాటిందని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడించాయి. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 54.7 లక్షల మంది మరణించారు.