ఆ దేశంలో 66 మంది పిల్లలు మృతి.. ఇండియన్‌ మెడిసన్‌ కంపెనీపై దర్యాప్తు

WHO flags four India-made paediatric cough syrups in West Africa after 66 kids die. భారత్‌కు చెందిన ఓ ప్రముఖ మెడిసన్‌ కంపెనీకి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హెచ్చరిక జారీ చేసింది. హర్యానా రాష్ట్రంలో

By అంజి  Published on  6 Oct 2022 6:15 AM GMT
ఆ దేశంలో 66 మంది పిల్లలు మృతి.. ఇండియన్‌ మెడిసన్‌ కంపెనీపై దర్యాప్తు

భారత్‌కు చెందిన ఓ ప్రముఖ మెడిసన్‌ కంపెనీకి వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ హెచ్చరిక జారీ చేసింది. హర్యానా రాష్ట్రంలోని మెయిడెన్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన నాలుగు కలుషిత సిరప్‌లు గాంబియా దేశంలోని 66 మంది చిన్నారుల మృతికి, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు కారణం కావొచ్చని హెచ్చరించింది. కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తోంది. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేస్తోంది.

అనారోగ్యానికి కారణమైన భారత్‌లోని మెయిడెన్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌ల వ్యవహారంపై.. భారత్‌లోని డ్రగ్స్‌ నియంత్రణ సంస్థలతో కలిసి డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తు చేపడుతోందని డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్ తెలిపారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పారు. ప్రొమెతజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు డబ్ల్యుహెచ్‌వో అలర్ట్‌ జారీ చేసింది.

అయితే ఈ మెడిసన్‌ తయారీలో భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించినట్టుగా ఇప్పటి వరకు మెయిడెన్‌ ఫార్మాసూటికల్స్‌ తగిన ఆధారాలు చూపెట్టలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ మెడిసన్‌ ప్రస్తుతానికి గాంబియా దేశంలో మాత్రమే వెలుగు చూశాయి. అయితే ఈ మెడిసన్ ఇతర దేశాలకు కూడా సరఫరా జరిగి ఉండొచ్చని డబ్లుహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ నాలుగు కలుషిత సిరప్‌లు విపణిలో లేకుండా చేయాలని అన్ని దేశాలకు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సూచించింది. సెప్టెంబర్‌లో గాంబియాలో చిన్నారుల మరణాల నేఫథ్యంలో ఈ మెడిసన్స్‌పై డబ్ల్యుహెచ్‌వోకు ఫిర్యాదు అందింది.

ఈ సిరప్​లలో అధిక మోతాదుల్లో డైఎథిలీన్​ గ్లైకాల్​, ఎథిలీన్ గ్లైకాల్​ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ రెండూ చాలా ప్రమాదకరమని, మరణానికీ కారణం కావచ్చని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

Next Story