కోవిడ్-19 పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు.. ఏ ప్రకటన చేస్తుందా అని ప్రపంచమంతా ఓ రకమైన టెన్షన్ తో ఎదురుచూస్తూ ఉండేది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి వచ్చినట్లు పేర్కొంది. వైరస్‌కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజాగా ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని కూడా పేర్కొన్నారు. వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని.. అయితే కొన్ని లోపాల కారణంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మరణాలు పెరిగేందుకు అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
చైనాలో పరిస్థితి మరోలా ఉంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి 'జీరో కోవిడ్' ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.. కోపంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. శుక్రవారం నాటికి చైనాలో 5,233 మరణాలు, 331,952కేసులు నమోదయ్యాయి.