ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
WHO Chief Congratulated PM Narendra Modi .. కరోనా వ్యాక్సిన్ 'కోవ్యాక్స్' తయారీలో భారత్ చిత్తశుద్దిని కొనియాడుతూ
By సుభాష్ Published on 12 Nov 2020 12:13 PM ISTకరోనా వ్యాక్సిన్ 'కోవ్యాక్స్' తయారీలో భారత్ చిత్తశుద్దిని కొనియాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసస్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కోవిడ్‌పై ఎంతో పోరాటం చేస్తున్నారని, కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు. కరోనా..ప్రపంచం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్ తయారీలో భారత్‌కు పూర్తి సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నరేంద్రమోదీ, గ్యాబ్రియేసస్ సంప్రదాయ ఔషధాల విషయమై బుధవారం ఫోన్‌లో సంభాషించారు. ప్రపంచానికి సంప్రదాయ ఔషధాల అవసరం ఎంతో ఉందని, వాటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని, అందుకోసం పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
కోవిడ్ సమయంలో WHO పాత్ర ముఖ్యమైనది- మోదీ
కోవిడ్ సమయంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర ముఖ్యమైనదని, కరోనా సమయంలో మహ్మారిని ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్‌వో చేసిన కృషిని మోదీ సైతం కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య ప్రమాణాల విషయంలో డబ్ల్యూహెచ్‌వో సహకారం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుదలలో సంప్రదాయ ఔషధాలలో ఉన్నవిలువల గురించి మాట్లాడారు. ప్రస్తుతం వైద్య విధానంలో సంప్రదాయ ఔషధాలను వినియోగించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన నియమలను, పరిశోధకుల నుంచి అనుమతి లభించగానే అందుకు ముందడుగు పడుతుందని మోదీ అన్నారు.
'కరోనాకు ఆయుర్వేద' దినోత్సవం
దేశంలో నవంబర్ 13న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ సందర్భంగా 'కరోనాకు ఆయుర్వేదం' అనే అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో కరోనాను అన్ని విధాలుగా ఎదుర్కొంటున్నామని, ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టడం వల్లే ఈ స్థాయిలో ఉన్నామన్నారు. మున్ముందు మరింతగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు.