కొవిడ్ టీకా.. భారత్‌లో 42 లక్షల ప్రాణాలు కాపాడింది
Vaccine prevented 42 lakh Covid deaths in India in 2021.భారత్‌లో వ్యాక్సిన్(కొవిడ్ టీకా) అందుబాటులోకి వచ్చిన తొలి
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2022 8:36 AM ISTభారత్‌లో వ్యాక్సిన్(కొవిడ్ టీకా) అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 42లక్షల మరణాలను అడ్డుకుందని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల ప్రాణాలు కాపాడినట్లు లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు. కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచమంతా విలవిలలాడుతున్నతరుణంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఓ సంజీవనిలా పనిచేసిందని,అధిక ప్రాణ నష్టం సంభవించకుండా కాపాడిందని అధ్యయనం తేల్చింది.
టీకా పంపిణీ మొదలైన తర్వాత 2020 డిసెంబర్ 8- 2021 డిసెంబర్ 8 మధ్య భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరణాల నివారణపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం నిర్వహించింది. చైనా మినహా ప్రపంచంలోని 185 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. కరోనా వ్యాప్తి, మరణాలు, సహా ఖచ్చితమైన సమాచారాన్ని బహిర్గతం కాని కారణంగా చైనాను ఈ అధ్యయనంలోకి పరిగణలోకి తీసుకోలేదు.
టీకా పంపిణీ వల్ల ఆ వ్యవధిలో భారత్‌లో 42 లక్షల కరోనా మరణాలను నివారించగలిగినట్టు నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 2 కోట్ల మంది ప్రాణాలను టీకాలు నిలిపాయని తెలిపింది. అలాగే డబ్ల్యూహెచ్‌వో సూచించిన విధంగా అన్నిదేశాలు 2021 చివరి కల్లా రెండు డోసులతో కనీసం 40 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసినట్లయితే మరో 5.99లక్షల ప్రాణాలు నిలిచేవని అంచనావేశారు. ఒకవేళ వ్యాక్సినేషన్ జరగనట్లయితే.. 1.81 కోట్ల మరణాలు సంభవించేంవని పరిశోధకులు అంచనాకు వచ్చారు.