వారికే రెండోసారి కొవిడ్ ముప్పు అధికం

Vaccination Offers Higher Protection than Previous COVID-19 Infection.క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇంకా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 8:11 AM GMT
వారికే రెండోసారి కొవిడ్ ముప్పు అధికం

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇంకా ఈ మ‌హ‌మ్మారి నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్ అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశాయి. అయితే.. కొన్ని దేశాల్లో ప్ర‌జ‌లు వ్యాక్సిన్లు తీసుకునేందుకు ముందు రావ‌డం లేదు. దీంతో ఆయా దేశాల్లో వ్యాక్సినేష‌న్‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు ప‌లు ర‌కాల ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక అమెరికాలో క‌రోనా వ్యాప్తి త‌గ్గిన‌ట్లే అనిపించినా.. మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 2ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అమెరికా అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న‌వారితో పోలిస్తే.. తీసుకోని వారిలో రీఇన్‌ఫెక్ష‌న్ (రెండో సారి క‌రోనా) ముప్పు 2.34 రెట్లు అధికంగా ఉంద‌ని సీడీసీ(సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) వెల్ల‌డించింది. అధ్య‌య‌నంలో భాగంగా వంద‌ల మందిని ప‌రిశీలించిన శాస్త్ర‌వేత్త‌లు ఈ మేర‌కు తేల్చారు. అందువ‌ల్ల గ‌తంలో కొవిడ్ బారిన ప‌డిన వారు కూడా త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని సీడీసీ డైరెక్ట‌ర్ రోషెల్ వాలెన్‌స్కీ తెలిపారు. డెల్టా ర‌కం క‌రోనా ఉద్దృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఇది అవ‌స‌రమ‌న్నారు. టీకాను తీసుకున్న‌ట్ల‌యితే.. ఆస్ప‌త్రికి వెళ్లే అవ‌స‌రం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని చెప్పారు. ఇక వ్యాక్సిన్ తీసుకోని వారికి రెండోసారి క‌రోనా వైర‌స్ సోకే అవ‌కాశం అధికంగా ఉంద‌ని, వ్యాక్సిన్ తీసుకోని వారి వ‌ల‌న ఎక్కువ‌గా వైర‌స్ వ్యాపిస్తోంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Next Story