భారత్ భద్రతలో సేఫ్‌గా ఇరాన్ షిప్
శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena) మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే..
By - అంజి |
భారత్ భద్రతలో సేఫ్‌గా ఇరాన్ షిప్
శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena) మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే, మరో ఇరాన్ నౌక భారత్ సహాయం కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభమైన రోజున, 'ఐరిస్ లావన్' (IRIS Lavan) అనే నౌక సాంకేతిక సమస్యల కారణంగా కొచ్చిలో అత్యవసరంగా డాకింగ్ చేయడానికి అనుమతి కోరింది. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR) కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఈ నౌకకు భారత ప్రభుత్వం మార్చి 1న అనుమతి ఇచ్చింది. దీంతో మార్చి 4న కొచ్చి చేరుకున్న ఈ నౌకలోని 183 మంది సిబ్బంది ప్రస్తుతం అక్కడి నౌకాదళ వసతులలో సురక్షితంగా ఉన్నారు.
అయితే, విశాఖపట్నంలో జరిగిన సైనిక విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న 'ఐరిస్ దేనా' నౌకకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. మార్చి 4న శ్రీలంకలోని గాలే ఓడరేవుకు 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తుండగా, అమెరికా జలాంతర్గామి ప్రయోగించిన టార్పెడో దాడిలో ఈ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 80 మందికి పైగా నావికులు ప్రాణాలు కోల్పోయారు. అతిథిగా వచ్చిన ఇరాన్ నౌకకు భారత్ సాయం చేయలేదన్న విమర్శలు రావడంతో భారత నౌకాదళం స్పందించింది. ప్రమాద హెచ్చరిక అందిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు ఐఎన్ఎస్ తరంగిణి (INS Tarangini), ఐఎన్ఎస్ ఇక్షాక్ (INS Ikshak) నౌకలను సహాయక చర్యల కోసం మళ్లించామని స్పష్టం చేసింది.
ఈ ఘటనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు, అంతర్జాతీయ జలాల్లో ఎటువంటి హెచ్చరిక లేకుండా అతిథి నౌకపై దాడి చేయడం అమానుషమని, దీనికి అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మరోవైపు, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇది కొనసాగుతున్న సంఘర్షణలో ఒక భాగమని పేర్కొన్నారు.