కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోసారి పలుదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మానవులకు మాత్రమే సోకిన కరోనా వైరస్ ఇప్పుడు జంతువులపైన కూడా ప్రభావం చూపుతోంది. అమెరికాలో నమోదు అయిన తొలి కేసు ఆందోళన కలిగిస్తోంది. ఈ దేశంలో తొలిసారి జింకకు కరోనా మహమ్మారి సోకింది. అమెరికా వ్యవసాయ శాఖ నివేదించిన దాని ప్రకారం.. ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కరోనా వైరస్ సోకిందని చెప్పింది.
కాగా.. జింకకు కరోనా సోకిందనే దానిపై సమాచారం లేదు. మనుషుల ద్వారానో లేక ఇతర జింకలు, లేదా జంతు జాతుల ద్వారా సోకి ఉండొచ్చునని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు. మనుషులు-జంతువులకు మధ్య కరోనా వ్యాప్తిపై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధనల్లో భాగంగా కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. జింకకు కరోనా సోకినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సింహాలు, చిరుతలు, కుక్కలు కరోనా బారిన పడగా.. జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.