లక్షల మంది ప్రాణాలు తీసిన 'బ్లాక్ డెత్'.. మళ్లీ బయటపడింది
యుఎస్ ఒరెగాన్‌లోని ప్రజారోగ్య అధికారులు స్థానిక వ్యక్తిలో 'బుబోనిక్ ప్లేగు' కేసును నివేదించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:58 AM ISTలక్షల మంది ప్రాణాలు తీసిన 'బ్లాక్ డెత్'.. మళ్లీ బయటపడింది
యుఎస్ ఒరెగాన్‌లోని ప్రజారోగ్య అధికారులు స్థానిక వ్యక్తిలో 'బుబోనిక్ ప్లేగు' కేసును నివేదించారు. అతని పెంపుడు పిల్లి నుండి ఈ ప్లేగు వ్యాధి సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. అతడికి కావాల్సిన మందులు అందిచామని.. కాంటాక్ట్ లిస్టును కూడా బయటకు తీశామని.. డాక్టర్ రిచర్డ్ ఫాసెట్, డెస్చుట్స్ కౌంటీ ఆరోగ్య అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును గుర్తించి, దాని ప్రారంభ దశలో చికిత్స చేశారని.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి కేసు అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో బయట పడింది. డెస్‌చుట్స్ కౌంటీకి చెందిన పేషెంట్ వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. ఇప్పటివరకూ కొత్త ప్లేగు కేసులేవీ బయటపడలేదని చెప్పారు. వ్యాధి తొలి దశలోనే కనుగొనడంతో రోగి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తమ ప్రాంతంలో బ్యూబోనిక్ ప్లేగు చాలా అరుదని, 2015లో చివరిసారిగా ఓ కేసు బయటపడిందని తెలిపారు. వ్యాధి బారిన పడ్డ ఎనిమిది రోజులకు పేషెంట్లో రోగ లక్షణాలు బయటపడతాయి. జ్వరం, వాంతులు, బలహీనత, చలి, కండరాల నొప్పులు వేధిస్తాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరి ప్రాణాంతకంగా మారుతుంది. ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. అక్కడి జనాభాలో ఏకంగా మూడో వంతు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ‘బ్లాక్ డెత్’ అన్న పేరు స్థిరపడింది. ప్రస్తుతం ఈ వ్యాధి దాదాపుగా అంతరించిపోయింది. ఇప్పటికీ దీన్నో ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు.