ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
By అంజి Published on 17 Oct 2023 11:41 AM ISTఇజ్రాయెల్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. దీంతో బిడెన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అగ్ర దౌత్యవేత్త బ్లింకెన్ దాదాపు 7 గంటల పాట సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తారని జెరూసలెంలోని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. కాగా నెతన్యాహు ఇన్విటేషన్ మేరకే బిడెన్ ఇజ్రాయెల్‌కు వస్తున్నారని బ్లింకెన్ చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు, వ్యూహాలపై బిడెన్‌కు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతోందని చెప్పారు. పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణ నెలకొన్న సంక్లిష్ట సమయంలో జోబైడెన్ పర్యటించనున్నారని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలవడంతో పాటు గాజాలోని పౌరులకు సాయం అందించడం బైడెన్ పర్యటన ప్రధాన లక్ష్యాలని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ''మానవతా సాయంపై ఆయన చర్చిస్తారు. గాజా పౌరులు కోరుకుంటే గాజాను విడిచి వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని కల్పించేందుకు బైడెన్ కృషి చేస్తారు'' అని కిర్బీ చెప్పారు. ఇజ్రాయెల్ పర్యటన తర్వాత అధ్యక్షుడు బిడెన్.. జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు వెళతారని తెలిపింది. అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్- సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారు. ఈ భేటీలో గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని సమాచారం.