సుప్రీం తీర్పుపై నిరాశ చెందానన్న బైడెన్
US President Biden 'Deeply Disappointed' With Court's Guns Ruling.అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2022 6:14 AM GMTఅమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో పౌరులు తుపాకీ వెంట తీసుకెళ్లే హక్కులపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే.. దీనిని కొందరు సవాల్ చేస్తూ ఆదేశ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ చట్టాన్ని కొట్టి వేస్తూ గురువారం తీర్పు నిచ్చింది.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికన్లు తుపాకులను తీసుకువెళ్లే ప్రాథమిక హక్కు ఉంటుందని తెలిపింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలిస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లో పౌరులు తమ వెంట తుపాకులు తీసుకుని వెళ్లొచ్చు. వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకీ కలిగి ఉండటం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తీర్పులో రాశారు.
టెక్సస్, న్యూ యార్క్, కాలిఫోర్నియాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తుపాకుల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో సుప్రీం తీర్పు వెలువడటం గమనార్హం. కాగా.. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. సుప్రీం ఆదేశాలపై తీవ్ర నిరాశ చెందినట్లు ప్రకటించారు. ఈ తీర్పు రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞానానికి విరుద్దంగా ఉంది. ఈతీర్పు అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది అని అన్నారు. అయితే.. తీర్పు ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రాలు మాత్రం తమ తమ పరిధిలో తుపాకీ నియంత్రణ చట్టాలు సమర్థవంతంగా అమలు చేయాలని తద్వారా నేరాలను కట్టడి చేయాలని ఆయన కోరారు.