Video: ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసిన అమెరికా

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్'...

By -  అంజి
Published on : 2 March 2026 9:20 AM IST

US-Iran War 2026, IRGC Headquarters Destroyed, Operation Epic Fury, US Centcom Strikes, Tehran Bombing, Ayatollah Ali Khamenei Killed

Video: ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసిన అమెరికా

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ను "పాము తల నరికేయడం" అని అమెరికా అభివర్ణించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సముద్రంలోని ఒక యుద్ధ నౌక నుండి ప్రయోగించిన క్షిపణి, తేహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ హెడ్ క్వార్టర్స్‌ను నేరుగా ఢీకొట్టి నిమిషాల్లోనే భవనాలను నామరూపాలు లేకుండా చేసింది.

గత 47 ఏళ్లలో ఐఆర్‌జీసీ దళాలు 1,000 మందికి పైగా అమెరికన్లను చంపాయని, దానికి ప్రతీకారంగానే ఈ భారీ దాడి జరిపామని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. 1979 విప్లవం తర్వాత ఏర్పడిన ఈ ఎలైట్ ఫోర్స్, ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లో పనిచేసేది. తాజా దాడితో ఈ వ్యవస్థకు కేంద్రస్థానమైన హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఉనికిలో లేదని అమెరికా ప్రకటించింది. శనివారం ప్రారంభమైన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లో భాగంగా అమెరికా సైన్యం ఇప్పటివరకు 1,000కి పైగా ఇరాన్ లక్ష్యాలను ఛేదించింది.

ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ సహా టాప్ మిలిటరీ నాయకత్వాన్ని మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించింది. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం, బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, నావికా దళ నౌకలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. అమెరికా సైనిక సామర్థ్యం ముందు ఇరాన్ పరిపాలనా, సైనిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని పెంటగాన్ వెల్లడించింది.

Next Story