పాక్‌కు ట్రంప్ గిఫ్ట్..BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
అమెరికా ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి అనుబంధ మజీద్ బ్రిగేడ్ లను “విదేశీ ఉగ్రవాద సంస్థలు” (Foreign Terrorist Organization – FTO)గా ప్రకటించింది.
By Knakam Karthik
పాక్‌కు ట్రంప్ గిఫ్ట్..BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
అమెరికా ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి అనుబంధ మజీద్ బ్రిగేడ్ లను “విదేశీ ఉగ్రవాద సంస్థలు” (Foreign Terrorist Organization – FTO)గా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, ఈ రెండు గ్రూపులపై అమెరికా భూభాగంలో లేదా అమెరికా పౌరులతో సంబంధాలపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుంది. అలాగే, వీరి ఆర్థిక లావాదేవీలను, ఆస్తులను అమెరికా అధికారులు ఫ్రీజ్ చేయగలరు.
BLA & మజీద్ బ్రిగేడ్ నేపథ్యం
BLA పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సాయుధ వర్గం. పాకిస్తాన్ ప్రభుత్వం వీరిని చాలా కాలం క్రితమే ఉగ్రవాదులుగా గుర్తించింది. మజీద్ బ్రిగేడ్ అనేది BLA కింద పనిచేసే ప్రత్యేక ఆత్మాహుతి దాడుల విభాగం. చైనీస్ ఇంజనీర్లపై, పాకిస్తాన్ సైనికులపై, అలాగే గ్వాదర్ పోర్ట్ ప్రాజెక్టులపై పలు దాడులకు కారణమైంది.
అమెరికా నిర్ణయం వెనుక కారణాలు
ఇటీవలి కాలంలో బలూచిస్తాన్‌లో చైనీస్ ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, భద్రతా సిబ్బందిపై దాడులు పెరిగాయి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటన ప్రకారం — ఈ గ్రూపులు పౌరులను, విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం, ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌తో సంబంధాలను బలోపేతం చేసే చర్యగా పరిగణించబడుతోంది.
అమెరికా గతంలో బలూచ్ తిరుగుబాటు వర్గాలపై మృదువైన వైఖరిని చూపించినా, ఇప్పుడు పాకిస్తాన్‌తో సహకారం పెంచుతూ “ఉగ్రవాద వ్యతిరేక” చర్యలపై కఠిన వైఖరికి వెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.BLA, మజీద్ బ్రిగేడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు, నిధుల సమీకరణలో ఇబ్బందులు పెరుగుతాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. “బలూచ్ ఉగ్రవాదులను అంతర్జాతీయంగా ఒంటరిచేయడంలో ఇది కీలక అడుగు” అని ఇస్లామాబాద్ అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పరిణామం ద్వారా అమెరికా-పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమైందని, ముఖ్యంగా చైనా పెట్టుబడులు, CPEC ప్రాజెక్టుల భద్రత విషయంలో మునీర్ నాయకత్వానికి ఇది బలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.