తమ దేశ ప్రజలను కరోనా నుండి కాపాడుకోవడానికి అమెరికా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిన్న మొన్నటి వరకూ ఇండియాకు వెళ్లవద్దంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఇప్పుడు జపాన్ కు వెళ్ళవద్దంటు తమ దేశస్థులను హెచ్చరిస్తోంది. జపాన్ లో కోవిడ్ కేసులు పెరిగిన కారణంగా టోక్యో ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ సలెవెల్ డు నాట్ ట్రావెల్' అనే అడ్వైజరీ'ని జారీ చేసింది.
ఇక కరోనా వైరస్ కారణంగా 2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ని జపాన్ ప్రభుత్వం తప్పని సరి పరిస్థితులలో వాయిదా వేసింది. గత మార్చి నెలలో హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పైగా మెడికల్ ప్రొఫ్షనల్స్ గానీ, సిరంజీలు తదితర వైద్య సామగ్రి గానీ తగినంతగా లేని కారణంగా ఇక్కడ వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. దీంతో మళ్ళీ టోక్యో ఒలంపిక్స్ ని వాయిదా వేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 6 వేలమంది డాక్టర్లతో కూడిన టోక్యో మెడికల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈ పోటీలను రద్దు చేయాలనీ కోరగా ఇందుకు సంబంధించిన పిటిషన్ పై మూడున్నర లక్షల మంది ప్రజలు సంతకాలు చేశారు.
కానీ వాయిదాపడిన మెగా ఈవెంట్‌ను ఎలాగైనా నిర్వహించడానికి జపాన్ ప్రధాని యోషిహైడ్ సుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ట్రావెల్ బ్యాన్ లాంటివేవీ తమ ఒలంపిక్స్ పై ప్రభావం చూపవు అంటోంది జపాన్. ఒలంపిక్ ను సురక్షితంగా నిర్వహించడానికి తాము అన్ని రకాలుగానూ సిద్ధమవుతున్నామంది.