కువైట్ నీటి శుద్ధీకరణ ప్లాంట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి
కువైట్‌లోని విద్యుత్ కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించినట్లు ఆ దేశ విద్యుత్ శాఖ సోమవారం ధృవీకరించింది.
By - అంజి |
కువైట్ నీటి శుద్ధీకరణ ప్లాంట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి
కువైట్‌లోని విద్యుత్ కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించినట్లు ఆ దేశ విద్యుత్ శాఖ సోమవారం ధృవీకరించింది. ఇరాన్ దురాక్రమణలో భాగంగా కువైట్‌లోని విద్యుత్ మరియు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌పై జరిగిన ఈ దాడిలో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాతిమా అబ్బాస్ జవహర్ హయత్ తెలిపారు. అటు ఇరాన్ రాజధాని టెహ్రాన్ మరియు పరిసర ప్రాంతాల్లోని విద్యుత్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల వల్ల అక్కడ కూడా భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరోవైపు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చర్చల పేరుతో అమెరికా రహస్యంగా భూతల దాడులకు ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు. "అమెరికా సైనికులు నేల మీద అడుగుపెడితే వారిని దహించి వేయడానికి మా సైన్యం సిద్ధంగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 3,500 మంది అదనపు సైనికులతో అమెరికా యుద్ధనౌక ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ కూడా తన రక్షణ బడ్జెట్‌ను 10 బిలియన్ డాలర్లకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ సంక్షోభం గల్ఫ్ దేశాలకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ చమురు రవాణాను స్తంభింపజేసింది. దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తున్న తరుణంలో, అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్ ముందుకు వచ్చింది. అయితే యుద్ధం మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో గల్ఫ్ రీజియన్ తీవ్ర అస్థిరతలో చిక్కుకుంది.