కరోనా చికిత్సలో తొలి టాబ్లెట్‌కు ఆమోదం
US Health Regulator Authorizes Pfizer's Covid Pill.కరోనా వైరస్.. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కేసులు
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2021 3:59 PM ISTకరోనా వైరస్.. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టే సమయానికి రూపం మార్చుకుంటూ దాడి చేస్తూనే ఉంది. ఈ మహమ్మారిని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చారు. రెండు లేదా మూడు డోసుల టీకా వేసుకోవాల్సి వస్తుంది. అయితే.. సూది కంటే మాత్ర అయితే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. వారి కోరిక ఫలించింది. ఇక మాత్ర కూడా అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ చికిత్సకు తొలి మాత్ర వచ్చేసింది. దీనికి అమెరికా ఆమోదం కూడా ఇచ్చేసింది.
పైజర్ రూపొందించిన 'పాక్స్‌లోవిడ్' పిల్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది. తీవ్రమైన కరోనా లక్షణాలున్నవారికి కూడా ఈ టాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చని అమెరికాలోని ఆస్పత్రులకు సూచించింది. ఈ టాబ్లెట్ రాక అమెరికాలో కరోనాపై పోరులో విప్లవాత్మక మార్పును తెస్తుందని.. ఫైజర్ వారి పాక్స్‌లోవిడ్ కోవిడ్ మాత్ర ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. కాగా..ఫైజర్ సంస్థ ఇప్పటికే కోటికిపైగా టాబ్లెట్లను సిద్ధం చేసింది. ఇప్పుడు అనుమతి కూడా లభించడంతో ఉత్పత్తి మరింత పెంచేందుకు సిద్ధం అవుతోంది. ఫైజర్ మాత్రను 12 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది.
ఇక ఇప్పటికే.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. దాని తయారీ, పంపిణీలో సంక్లిష్టతల కారణంగా చిట్టచివరి మనిషికీ టీకాలు అందడంలేదు. ఇక టీకా తీసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. దీనిపై అపోహే ఇందుకు కారణం. టీకాలపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను పోగొట్టడం ప్రభుత్వాలకు సమస్యగా మారింది. అయితే.. కరోనా చికిత్సలో చేరిన తొలి టాబ్లెట్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.