భారత్ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్..
US FDA rejects emergency use approval for covaxin.భారత్ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 1:24 PM ISTభారత్ బయోటెక్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించింది. అమెరికాలో ఆక్యుజెన్ అనే ఫార్మా కంపెనీ కొవాగ్జిన్ సప్లై కోసం భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇకపై తాము అత్యవసర వినియోగానికి అనుమతి కోరమని.. పూర్తిస్థాయి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆక్యుజెన్ వెల్లడించింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్‌డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
అత్యవసర వినియోగానికి అనుమతి సాధించేలా కనిపించామని, అయితే ఎఫ్‌డీఏ మాత్రం బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా సూచించిందని అక్యుజెన్ తెలిపింది. ఈ ప్రక్రియకు సమయం పడుతుందని, అయితే కొవాగ్జిన్‌ను అమెరికాకు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని అక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి స్పష్టం చేశారు. కాగా.. ప్రస్తుతం అమెరికాలో పైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు.
మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్‌ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు వస్తున్న సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.