కాలిఫోర్నియాలోని యుఎస్ సరిహద్దును దాటడానికి ప్రయత్నించిన అమన్ అనే వ్యక్తి తన దుస్తులలో ఏకంగా 52 బల్లులు, పాములను దాచిపెట్టినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 25న మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్‌సిడ్రో సరిహద్దు వద్దకు ట్రక్కుతో వచ్చినప్పుడు అదనపు తనిఖీల కోసం అతన్ని బయటకు రమ్మన్నట్లు యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారులు పరిశీలించగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచిన విషయాన్ని మనం గమనించవచ్చు. మనిషి జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా పలు వస్త్రాల్లో ఆ జీవులను దాచినట్లు కనుగొన్నారు.
తొమ్మిది పాములు, 43 అరుదైన బల్లులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న లిస్ట్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. "స్మగ్లర్లు ఇలాంటి వాటిని తరలించడానికి, సాధ్యమైన అన్ని మార్గాలను వాడుతూ ఉంటారు.. వాటిని సజీవంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు." అని శాన్ డియాగోలోని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ డైరెక్టర్ ఆఫ్ ఫీల్డ్ ఆపరేషన్స్ సిడ్నీ అకీ అన్నారు. జంతువుల ఆరోగ్యం, భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని యూఎస్‌లోకి తీసుకురావడానికి సీబీపీ అధికారులను మోసగించడానికి స్మగ్లర్ ప్రయత్నించాడు. అమెరికా పౌరుడైన అతడిని అరెస్టు చేశారు.