అఫ్గాన్ నుంచి వెనుదిరిగిన అమెరికా దళాలు
US and Nato start withdrawal of troops from Afghanistan. దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్‌లో యుద్ధాన్ని కొనసాగించిన అమెరికా, నాటో సేనల ఉపసంహరణ చివరి దశకు వచ్చింది
By Medi Samrat
దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్‌లో యుద్ధాన్ని కొనసాగించిన అమెరికా, నాటో సేనల ఉపసంహరణ చివరి దశకు వచ్చింది. వేసవి కాలం ముగిసే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా సైనికులు సుమారు 3 వేలమంది, నాటో సైనికులు ఏడు వేల మంది వరకూ అఫ్గానిస్థాన్‌లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినట్లుగానే మే ఒకటో తేదీ నుంచి సాయుధ బలగాలు వెనక్కు మళ్లడం మొదలయ్యింది. దీనికన్నా ఒక్కరోజు ముందే సైనిక సామగ్రిని సి-17వంటి భారీ కార్గో విమానాల్లో తరలించడాన్ని చేపట్టారు.
2001 సెప్టెంబరు 11 వ తేదీన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైన జరిగిన దాడిలో భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఆల్ ఖయిదా ప్రకటించుకుంది. అంతే కాదు అమెరికా మీద ఇటువంటి దాడులు మరిన్ని జరుగుతాయని అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ప్రకటించారు. దాంతో అగ్రరాజ్యం అమెరికాకు ఈగో దెబ్బతిన్నది. ఫలితంగా 2011 అక్టోబరు 7వ తేదీన అమెరికా, నాటో దేశాల దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను వెతుక్కుంటూ వెళ్లి ఆ తర్వాత క్రమంగా తాలిబన్ల ను అంతం చేయడం ప్రారంభించాయి. బిన్ లాడెన్‌ను అమెరికాకు చెందిన నేవీ దళం సీల్ టీమ్ హతమార్చింది. సుదీర్ఘంగా అంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా రకరకాల దాడులకు పాల్పడ్డాయి. వైమానిక దాడులతో అఫ్గనిస్తాన్ పౌరులను హడలెత్తించాయి. ఎక్కడ నలుగురు యువకులు కలిసి వున్నా వారిని ఉగ్రవాదులగా ముద్ర వేసి నాటో దళాలు హతమార్చాయి.
సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్‌లపై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని అమెరికా సైన్యం కానీ, నాటో దళాలు కానీ సాధించలేకపోయాయి. చివరికి అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మళ్లీ గెలిస్తే నుంచి దళాలు ఉపసంహరిస్తానని హామీ ఇచ్చారు. అయితే బైడన్ మాత్రం ఈ అంశం పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాను అధికారపగ్గాలు చేపట్టిన మూడు నెలలకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో దళాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపసంహరణ మే 1వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీన ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.