అమెరికా-భారత్ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ఒక ప్రధాన అడుగు ముందుకు పడింది. US వైమానిక దళం విమానం బెంగళూరులో ల్యాండ్ అయింది. NASA ఉపగ్రహాన్ని విమానం తీసుకుని వచ్చింది. C-17 రవాణా విమానం కాలిఫోర్నియా నుండి NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ (NISAR) ఉపగ్రహంతో భారత్ కు చేరుకుంది. భూమి క్రస్ట్, ప్రపంచవ్యాప్తంగా మంచు ఉపరితలాలలో మార్పులను కొలవడానికి భారత్-అమెరికా కలిసి ఉమ్మడి మిషన్ చేపట్టాయి. NISAR ఉపగ్రహం భూమిపర్యావరణ వ్యవస్థలలో మార్పులను తెలుసుకుంటుంది. భూమి-ఉపరితల మార్పుల పరిణామాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
NISAR ఉపగ్రహం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్ర మట్టం పెరుగుదల లాంటి.. ప్రకృతి వైపరీత్యాల హెచ్చరిక సంకేతాలను కూడా గుర్తించగలదు. హిమాలయాల్లోని హిమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని హిమానీనదాలను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది. ఈ ఉపగ్రహం సుమారు 2,800 కిలోల బరువు ఉంటుంది. L అండ్ S-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) పరికరాలను కలిగి ఉంటుంది. NISAR ఉపగ్రహం వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక రిజల్యూషన్ ఉన్న చిత్రాలను పంపించగలదు.