ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. క్రిస్మ‌స్ త‌రువాత రెండు వారాల లాక్‌డౌన్‌..!

United Kingdom planning 2 week lockdown after Christmas.కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 3:21 AM GMT
ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. క్రిస్మ‌స్ త‌రువాత రెండు వారాల లాక్‌డౌన్‌..!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. 89 దేశాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల‌ను గుర్తించిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అన్నిదేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో చాలా దేశాలు విదేశీ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఇక విదేశాల నుంచి వ‌చ్చే వారికి త‌ప్పనిస‌రిగా ఒమిక్రాన్ నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డంతో పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని ఆంక్ష‌లు పెట్టాయి. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్దం అవుతోంది.

కిస్మస్‌ తర్వాత రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. ప్రాంగ‌ణాల లోప‌ల నిర్వ‌హించే స‌మావేశాల‌పై నిషేదం విధించ‌డంతో పాటు రెస్టారెంట్లు వంటి వాటిని అవుట్‌డోర్ సేవ‌ల‌కే ప‌రిమితం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి శాస్త్ర‌వేత్త‌ల బృందం ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ముందు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఉంచింది. అందులో రెండువారాల లాక్‌డౌన్ ఒక‌టి.

ఇటీవ‌ల యూకేలో భారీగా క‌రోనా కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం 88,376 న‌మోదు కాగా.. శుక్రవారం ఏకంగా 93,045 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. చాలాచోట్ల ఇప్ప‌టికీ డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌గా.. లండ‌న్‌, స్కాంట్లాండ్‌ల‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇక లండన్‌లో శుక్రవారం ఒకేరోజు 26 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో లండన్‌ మేయర్‌ ఎమర్జెన్సీని ప్ర‌టించారు. ఇక్క‌డ క‌రోనా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య 1,534కి చేరింది. రోజు రోజుకు ఇక్క‌డ ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌గా.. ఇంకో వైపు విధులకు హాజరయ్యే సిబ్బంది సంఖ్య తగ్గిపోతోంది.

ఒమిక్రాన్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు చాలా దేశాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు అపద్ధర్మ ప్రధాని మార్క్‌ రుట్టే ప్రకటించారు. ఇక‌ ఫ్రాన్స్ కొత్త‌ సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. డెన్మార్క్‌ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను మూసివేసింది.

Next Story