కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోక ముందే.. కొత్త వ్యాధులు భయపెడుతున్నాయి. కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్, దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేయగా..బ్రెజిల్‌లోనూ కొత్త స్ట్రెయిన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ కొత్త వ్యాధి భయపెడుతోంది. అక్కడి ప్రజలు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. ఇలా వాంతులు చేసుకున్న వారు గంటలోనే మరణిస్తున్నారు. టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలో ఈ కొత్త వ్యాధి ప్రబలింది. వెంటనే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడికి ప్రత్యేక వైద్య బృందాలను పంపింది.
ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధితో 15 మంది మరణించగా, 50 మందికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరంతా ఆస్పత్రిలో చికత్స పొందుతున్నారు. అయితే.. ఈ వింత వ్యాధి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తున్నట్టు టాంజానియా వైద్యశాఖ ప్రకటించింది.
ఇఫంబో యొక్క ఒకే ఒక పరిపాలనా వార్డులో ఇది జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు రక్తాన్ని వాంతి చేసుకుంటున్నారని , ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చినవారు చనిపోతున్నారని, ముందుగానే అనారోగ్యాన్ని గుర్తించి ఆసుపత్రికి వచ్చిన వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నామని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ అనారోగ్యానికి సంబంధించిన కారణం ఇంకా గుర్తించబడలేదని తెలుస్తోంది.