ప్రముఖ ఉక్రెయిన్ నటుడు, టీవీ హోస్ట్ పాషా లీ రష్యా దాడిలో మరణించాడు. గత వారం ఉక్రెయిన్ సాయుధ దళాల టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరిన పాషా లీ.. రష్యా దళాల దాడి మధ్య తన దేశాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మరణించారు. మిర్రర్ పత్రిక కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌లో 'హాబిట్' అని పిలిచే నటుడు పాషా లీ ఇర్పెన్‌లో రష్యన్ బలగాల బాంబు దాడుల్లో చనిపోయాడు. 33 ఏళ్ల వయసున్న పాషా లీ యుద్ధం కారణంగా నటనను విడిచిపెట్టి టెరిటోరియల్ డిఫెన్స్ యూనిట్‌లో చేరారు. సైన్యం సూచనలను పాటిస్తూ దేశం కోసం ముందు వరుసలో నిల్చుని ప్రాణాలు వదిలాడు.
మార్చి 6 న రష్యా యొక్క ఇర్పిన్ బాంబు దాడిలో పాషా లీ మరణించాడు. ఉక్రెయిన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు సెర్గీ టోమిలెంకో పాషా లీ మరణాన్ని ధృవీకరించారు. పాషా లీ నటనతో పాటు టీవీ హోస్ట్‌గా పని చేశారు. 'ది లయన్ కింగ్', మాలిబు రెస్క్యూర్స్', 'హాబిట్' వంటి హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. 'స్టోల్న్యా' సినిమాతో 2006లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు పాషా లీ. ఆ తర్వాత అతడు నటించిన 'షాడో ఆఫ్ ది అన్‌ఫర్‌గాటెన్ యాన్సిస్టర్', 'ది ఫైట్ రూల్స్' 'మీటింగ్స్ ఆఫ్ క్లాస్‌మేట్స్' వంటి సినిమాలు అయనకు ఎంతో పేరు తెచ్చాయి.