ఒమిక్రాన్ విలయతాండవం.. ఒక్కరోజే 10 వేల కేసులు

UK reports over 10000 new cases.క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. కేసులు త‌గ్గుతున్నాయ‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Dec 2021 3:15 AM GMT
ఒమిక్రాన్ విలయతాండవం.. ఒక్కరోజే 10 వేల కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. కేసులు త‌గ్గుతున్నాయ‌ని అనుకునే స‌మ‌యానికి కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తోంది. తాజాగా ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా బ్రిట‌న్ మాత్రం ఒమిక్రాన్ ధాటికి చిగురుటాకులా వ‌ణికిపోతుంది. రోజువారీ కేసులతో పోలిస్తే.. ఆదివారం కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు రేట్లు పెరిగింది. గ‌త 24 గంట‌ల్లో 90 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. అందులో 10వేల‌కు పైగా ఒమిక్రాన్ వేరియంట్ వే కావ‌డం గ‌మ‌నార్హం. ఒమిక్రాన్ కార‌ణంగా తొలి మ‌ర‌ణం చోటు చేసుకున్న బ్రిట‌న్‌లో ప్ర‌స్తుతం మ‌ర‌ణాల సంఖ్య ఏడుకు చేరిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ తెలిపింది.

ప్ర‌స్తుతం బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌24,968కి పెరుగ‌గా.. ఏడుగురు మ‌ర‌ణించారు. ఇక ఒమిక్రాన్‌తో పాటు క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీనిపై బ్రిట‌న్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ మాట్లాడారు. గత 24 గంటల్లోనే 90,418 క‌రోనా కేసులు నమోదుకావడం ఆందోళన క‌లిగిస్తోంద‌న్నారు. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు శాస్త్ర‌వేత్త‌ల‌తో ఎప్ప‌టికప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు. వారు సూచించే దాని బ‌ట్లే లాక్‌డౌన్ విధించాలా..? లేదా క‌ట్టుదిట్ట‌మైన ఆంక్ష‌లు పెట్టాలా అన్న‌దానిపైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. కాగా.. పోయిన సంవ‌త్స‌రం క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ఆస్ప‌త్రుల్లో చేరిన వారితో పోలిస్తే ప్ర‌స్తుతం ఆ సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ట్లు సాజిద్ తెలిపారు. ఇక‌.. క్రిస్మస్‌కు ఐదు రోజుల‌ సమయం మాత్ర‌మే ఉండటంతో ప్రజలంతా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు.

Next Story