కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నవంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 57 దేశాలకు పాకింది. డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుండడంతో అన్ని దేశాల ప్రజలు భయపడుతున్నారు. ఇక బ్రిటన్ అయితే వణికిస్తోంది. అక్కడ మంగళవారం ఒక్క రోజులోనే 101 కొత్త కేసులు నమోదు అయ్యాయంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ పరిస్థితులపై కేబినేట్ సమావేశాన్ని నిర్వహించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక బ్రిటన్‌లో కొత్తగా 45,691 కరోనా పాజిటివ్ కేసులు.. 180 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,560,341కి మరణాల సంఖ్య 1,45,826కి చేరింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,701కి చేరింది. బ్రిటన్‌లో 437, డెన్మార్క్‌లో 398, దక్షిణాఫ్రికాలో 255, అమెరికాలో 50, జింబాబ్వేలో 50, భారతదేశంలో 23తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే విమాన ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్‌డౌన్ విధించారు. ఇక భారతదేశంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు కరోనా నిర్థారణ పరీక్షలను తప్పనిసరి చేశారు.