అలా చేయడం తప్పే.. క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
UK PM Rishi Sunak Apologises For Removing Car Seat Belt.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు.
By తోట వంశీ కుమార్ Published on 20 Jan 2023 10:21 AM ISTబ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో తాను చేసిన తప్పును అంగీకరిస్తూ ఆయన క్షమాపణలు కోరారు.
ఆర్థిక మాంద్యం నుంచి గట్టు ఎక్కేందుకు రిషి సునాక్ సారథ్యంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక దేశ అభివృద్ది కోసం దేశ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. అయితే.. ఆ ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి కొత్త లెవలింగ్ ఆఫ్ ఫండ్ ప్రకటనలను ప్రచారం చేయాలని బావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఓ వీడియోను రూపొందించింది. ఇందులో ప్రధాని సునాక్ పాల్గొన్నారు.
అయితే.. ఆ వీడియోలో కారులో ఉన్న ప్రధాని సునాక్ సీటు బెల్ట్‌ను పెట్టుకోలేదు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ప్రధాని సునాక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. తన తప్పును గ్రహించిన ప్రధాని సునాక్ క్షమాపణలు చెప్పారు. సునాక్ తన సీటు బెల్ట్ కొద్దిసేపు మాత్రమే తొలగించాడని, అయినా తప్పు చేశానని అంగీకరించాడని, అందుకే క్షమాపణలు చెప్పారని ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి తెలిపారు. విధిగా ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని ప్రధాన మంత్రి విశ్వసిస్తున్నారన్నారు.
అత్యవసర వైద్యం పొందాల్సిన వారు మినహా బ్రిటన్‌లో కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరు సీట్‌బెల్ట్ పెట్టుకోవాల్సిందే. సీట్‌బెల్ట్ ధరించడంలో విఫలం అయితే.. అక్కడికక్కడే 100 పౌండ్ల జరిమానా వేస్తారు. ఒకవేళ కేసు కోర్టుకు వెళితే 500 పౌండ్ల వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.