బ్రిటన్ ఎంపీ దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే..
UK MP David Amess dies after being stabbed multiple times.ఓ చర్చిలో మీట్ యువర్ లోకల్ ఎంపీ కార్యక్రమం కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 9:08 AM IST
ఓ చర్చిలో 'మీట్ యువర్ లోకల్ ఎంపీ' కార్యక్రమం కొనసాగుతోంది. ఇంతలో ఓ దుండగుడు కత్తితో ఎంపీపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న వారు ఎంపీని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూశారు. ఈ దారుణ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం ఆయన స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన 'మీట్ యువర్ లోకల్ ఎంపీ' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే.. ఓ వ్యక్తి.. ఎంపీపై అకస్మాత్తుగా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న వారు వెంటనే స్పందించి ఎంపీని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ డేవిడ్ అమీస్ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
1983 నుంచి డేవిడ్ అమీస్ ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జంతు సమస్యలతో పాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. కాగా.. అమీస్ మృతిపై తోటి ఎంపీలు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.