పీఏతో మంత్రి ముద్దు.. ఫోటో లీక్‌.. రాజీనామా

UK Minister Resigns After Kissing Photos Trigger.మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఎంతో బాధ్య‌త‌గా మెల‌గాలి. కానీ ఓ మంత్రి త‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2021 5:42 AM GMT
పీఏతో మంత్రి ముద్దు.. ఫోటో లీక్‌.. రాజీనామా

మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఎంతో బాధ్య‌త‌గా మెల‌గాలి. కానీ ఓ మంత్రి త‌న అనుచ‌రురాలితో ఆఫీసులోనే రాస‌లీల‌లు సాగించాడు. స‌ద‌రు మ‌హిళ‌కు ముద్దు పెడుతున్న ఫోటో లీక్ అయ్యింది. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లో పెనుదుమారం రేపింది. ప్ర‌జాగ్ర‌హం పెల్లుబిక్కింది. చివ‌రికి ఆ ఫోటోలో ఉన్న‌ది తానేన‌ని ఒప్పుకున్న స‌ద‌రు మంత్రి అందుకు క్ష‌మాప‌ణలు చెప్పాడు. అంతేకాదు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా కూడా చేశాడు. ఈ ఘ‌ట‌న యూకేలో జ‌రిగింది.

యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హన్‌కాక్ య‌వ్వారం ఇది. వివాహితుడైన మంత్రి.. ఓ మ‌హిళ‌ను ఏరి కోరి త‌న అసిస్టెంట్‌గా నియ‌మించుకున్నాడు. ఆమెతో ఆఫీసులోనే రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నాడు. అయితే.. ది సన్ టాబ్లాయిడ్ 'పీఏ హాంకాక్ రాస‌లీల‌లు' పేరుతో స‌ద‌రు మంత్రిగారు మ‌హిళ‌కు ముద్దుపెడుతున్న ఫోటోను పేజీ బ్యాన‌ర్ ఐట‌మ్‌గా ప్ర‌చురించుకుంది. క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంగించాడంటూ పేర్కొంది. ఈ ఫొటో మే 6 నుంచి 11 మధ్య కాలంలో తీసిందని.. అప్పటికీ ఇంకా లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేయలేదని తెలిపింది.

ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారికి హగ్స్ ఇవ్వడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని వివరించింది. అంతేకాదు.. ఆ ఫొటోలో ఉన్న మహిళను హన్‌కాక్ 2000 సంవత్సరంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని.. గత నెలలోనే ఆమెను హన్ కాక్ తన సహాయ అధికారిగా నియమించుకున్నాడట. ఈ విష‌యంపై పెద్ద ఎత్తున దుమార‌మే రేగింది. దీంతో స్పందించిన హన్‌కాక్.. ఆ ఫొటో తనదేనని అంగీకరించాడు. ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌కు ఓ క్ష‌మాప‌ణ లేఖ కూడా రాశాడు. తాను మార్గ‌ద‌ర్శ‌కాలు ఉల్లంగించాన‌ని.. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. మంత్రి గారి రాజీనామాను ప్ర‌ధాని బోరిస్ వెంట‌నే ఆమోదించారు.

Next Story