ఎయిర్‌పోర్టులో ఒకేరోజు కూలిన రెండు విమానాలు

టాంజానియా దేశంలో ఒకే రోజు.. అది కూడా ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు కలవరం సృష్టించాయి.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 5:19 AM GMT
flight, accident,  tanzania,

ఎయిర్‌పోర్టులో ఒకేరోజు కూలిన రెండు విమానాలు

టాంజానియా దేశంలో ఒకే రోజు.. అది కూడా ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు కలవరం సృష్టించాయి. అది కూడా కొద్ది గంటల వ్యవధిలో జరగడం ఆందోళనకు గురి చేసింది. రెండు విమానాల్లో ఒకటి ల్యాండింగ్.. మరోటి టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురి అయ్యాయి. యాదృచ్ఛికంగా రెండు విమానాల్లో 30 మంది చొప్పున ప్రయాణికులు... ముగ్గురు చొప్పున సిబ్బంది ఉన్నారు. కాగా.. ఒకే ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో విమానాలు బాగా దెబ్బతిన్నా కూడా ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయిజ

టాంజానియాలోని కికోబోగా ఎయిర్‌పోర్టు ఉంది. ఈ ఎయిర్‌పోర్టులోనే గత మంగళవారం వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొదటి ప్రమాదం.. జాంజిబార్‌ ఎయిర్‌పోర్టు నుంచి 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో వస్తున్న యునైటెడ్‌ ఎయిర్‌ జాంజిబార్‌ విమానం కికోబోగా ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురి అయ్యింది. ల్యాండింగ్ అవుతుండగా విమానం రన్‌ వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దాంతో.. రన్‌వేపైనే విమానం కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. విమానం బాగా దెబ్బతిన్నది. కానీ.. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ విషయం కికోబోగా ఎయిర్‌పోర్టు అధికారులే స్వయంగా వెల్లడించారు.

ఉదయం ఈ ప్రమాదం జరగ్గా.. దాని గురించే ఎయిర్‌పోర్టు సిబ్బంది అంతా మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా మరో ఆరు గంటల తర్వాత ఇంకో ప్రమాదం చోటుచేసుకుంది కికోబోగా ఎయిర్‌పోర్టులో. జాంజిబార్‌ వెళ్లేందుకు ఒక విమానం సిద్ధం అయ్యింది. అందులో కూడా 30 మంది ప్రయాణికులు.. ముగ్గురు సిబ్బంది ఉన్నారు. రన్‌వేపై తగిన వేగాన్ని అందుకున్నాక విమానం గాల్లోకి బాగానే టేకాఫ్‌ తీసుకుంది. కానీ.. కొద్ది క్షణాల్లోనే రన్‌వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ అనుకోకుండా ఆ విమానం ఢీకొట్టింది. దాంతో.. నోస్‌ గేర్‌ కొలాప్స్‌ అయ్యాయి. దాంతో.. ఆవిమానాన్ని వెంటనే పైలట్స్‌ అదే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో కూడా ప్రయాణికులకు ఏం కాలేదని.. క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. వరుసగా జరిగిన ఈ రెండు ప్రమాదాలు కికోబోగా ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి.

Next Story