పాపం.. ఆఫీసులో పడుకుని మరీ కష్టపడి పని చేసింది.. అయినా ఉద్యోగం పాయె
లక్ష్యాలను చేరుకోవాలని ఆఫీసులోనే పడుకుని మరీ కష్టపడి పని చేసిన ఎస్తర్ క్రాఫోర్డ్ ఉద్యోగం పోయింది
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 10:13 AM ISTప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతోంది. వ్యవ నియంత్రణ అంటూ కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఇంకా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా.. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాడు. కొందరు ఉద్యోగులకు ఇ-మెయిల్స్ ద్వారా, మరికొందరికి లాగిన్ యాక్సిస్ నిరాకరించడం ద్వారా తెలియజేసినట్లు సమాచారం. ఉద్యోగాలు పోయిన వారిలో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్‌పై పనిచేసే ఇంజినీర్లు ఉన్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన కొందరు చెబుతున్నారు.
తాజా లేఆఫ్ లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న ఎస్తర్ క్రాఫోర్డ్ ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. పని చేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ గతంలో ఆఫీసులోనే పడుకుని వార్తల్లో నిలిచిన ఆమెను కూడా మస్క్ తొలగించారు.
మస్క్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఉద్యోగాలను తొలగించడంతో పాటు ఉన్న ఉద్యోగులకు అనేక లక్ష్యాలను నిర్దేశించాడు. వాటిని అందుకోని వారిని ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పాడు. దీంతో ప్రొడక్ట్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఎస్టర్.. గడువు లోగా టార్గెట్‌ను అందుకోవడానికి గతంలో ఆఫీసులోనే నిద్రించారు. పరోక్షంగా ఆమె ఎలాన్ మస్క్‌కు మద్దతు తెలిపారు. ఆమె ఆఫీసులో పడుకున్న ఫోటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆమె చేసిన దానిపై విమర్శలు రావడంతో పని చేసే ప్రదేశాన్ని ప్రేమించాలని హితవు పలికారు.
When your team is pushing round the clock to make deadlines sometimes you #SleepWhereYouWork https://t.co/UBGKYPilbD
— Esther Crawford ✨ (@esthercrawford) November 2, 2022
ఇప్పుడు ఈమె ఉద్యోగం కూడా పోవడం గమనార్హం. దీనిపై ఎస్తర్ క్రాఫోర్డ్ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడడం, ఆశావహ ధృక్పథంతో పని చేయడం తప్పని తెలిసొచ్చిందని వాపోయారు.
ఇదిలా ఉంటే.. ట్విటర్ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఉద్యోగులను తొలగించింది. పాత యాజమాన్యంలో 7500 మంది ఉద్యోగులు పని చేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2వేలకు అటు, ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది.