విమానం నడుపుతుండగా పైలట్‌ ఆకస్మిక మరణం.. ఆ తర్వాత ఏమైందంటే?

సీటెల్ నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం నాడు న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.

By అంజి  Published on  10 Oct 2024 3:30 AM GMT
Turkish Airlines, flight, emergency landing, New York, pilot died

విమానం నడుపుతుండగా పైలట్‌ ఆకస్మిక మరణం.. ఆ తర్వాత..

సీటెల్ నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం నాడు న్యూయార్క్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. విమానం గాలిలో ఉండగానే కెప్టెన్ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడని ఎయిర్‌లైన్ అధికారి తెలిపారు.

మంగళవారం రాత్రి సియాటిల్ నుంచి ఫ్లైట్ 204 టేకాఫ్ అయిన తర్వాత పైలట్ ఇల్సెహిన్ పెహ్లివాన్ (59) స్పృహ కోల్పోయాడు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి యాహ్యా ఉస్తున్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. వైద్యపరమైన జోక్యం ఉన్నప్పటికీ అతను తిరిగ లేవలేదు. ఆ తర్వాత రెండవ పైలట్, కో-పైలట్ విమానం నియంత్రణలను హ్యాండ్‌ ఓవర్‌ చేసుకున్నారు.

ట్రాకింగ్ సైట్ ఫ్లైట్‌అవేర్ డేటా ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల ముందు విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సియాటిల్ నుంచి బయలుదేరిన ఎనిమిది గంటల తర్వాత విమానం న్యూయార్క్‌లో ల్యాండ్ అయింది. పెహ్లివాన్ 2007 నుండి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో పని చేస్తున్నాడు. అతను మార్చి 8న క్రమానుగతంగా ఆరోగ్య పరీక్ష చేయించుకున్నాడు, అతను పని చేయకుండా నిరోధించే ఆరోగ్య సమస్య ఏదీ కనుగొనబడలేదు, ఉస్తున్ చెప్పారు.

"న్యూయార్క్ నుండి ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. పైలట్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. సాధారణంగా, పైలట్‌లు ప్రతి 12 నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, 40 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలల తర్వాత వారి మెడికల్ సర్టిఫికేట్‌ను పునరుద్ధరించుకోవాలి.

"టర్కిష్ ఎయిర్‌లైన్స్ తరపున, మా కెప్టెన్‌ను కోల్పోయినందుకు మేము తీవ్రంగా బాధపడుతున్నాం. అతని కుటుంబ సభ్యులకు, సహచరులకు, అతని ప్రియమైన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని ఉస్తున్ చెప్పారు.

Next Story