'యుద్ధంలో గెలిచాం.. ఇది ప్రపంచ శాంతికి ఒక శుభపరిణాం'.. డొనాల్డ్‌ ట్రంప్!

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య గత నాలుగు వారాలుగా సాగుతున్న యుద్ధం ఒక ముగింపునకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

By -  అంజి
Published on : 25 March 2026 7:56 AM IST

Donald Trump Iran War, Strait of Hormuz Crisis, Iran Nuclear Weapons Agreement, US-Iran Peace Negotiations, Oil and Gas Market Update, JD Vance Marco Rubio Iran, Middle East Conflict 2026

'యుద్ధంలో గెలిచాం.. ఇది ప్రపంచ శాంతికి ఒక శుభపరిణాం'.. డొనాల్డ్‌ ట్రంప్

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య గత నాలుగు వారాలుగా సాగుతున్న యుద్ధం ఒక ముగింపునకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ఒక మెట్టు దిగివచ్చిందని, అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని వారు అంగీకరించారని వెల్లడించారు. ఇది ప్రపంచ శాంతికి ఒక శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తమకు అత్యంత విలువైన ఒక 'కానుక' ఇచ్చిందని, అది ఈరోజే తమకు అందిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అది అణ్వాయుధాలకు సంబంధించింది కాదని, చమురు, సహజవాయువు రంగానికి చెందినదని ఆయన హింట్ ఇచ్చారు. ఇది వందల కోట్ల డాలర్ల విలువైనదని చెబుతూనే, పూర్తి వివరాలను బయటపెట్టడానికి ఆయన నిరాకరించారు.

ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను పునరుద్ధరించే అంశంపై ఇరాన్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో అమెరికా ఇప్పటికే ఘనవిజయం సాధించిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు సామర్థ్యం, నావికాదళం, రాడార్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం ఎంత వేగంగా వచ్చిందంటే.. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ కూడా ఇంత త్వరగా ముగుస్తుందని ఊహించలేదని ఆయన చమత్కరించారు. ప్రస్తుతం జేడీ వాన్స్, మార్కో రూబియో, జారెడ్ కుష్నర్ వంటి కీలక నేతలు ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్ మాత్రం తాము అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో ఎటువంటి చర్చలు జరపడం లేదని ఖండిస్తుండటం గమనార్హం.

Next Story