వందల ఏళ్ల కిందటి సమాధిలో బయటపడ్డ కోట్ల విలువైన నిధి
12 వందల ఏళ్ల నాటి సమాధి తవ్వుతుండగా కోట్లు విలువ చేసే నిధి బయటపడింది.
By Srikanth Gundamalla Published on 11 March 2024 8:10 AM GMTవందల ఏళ్ల కిందటి సమాధిలో బయటపడ్డ కోట్ల విలువైన నిధి
అమెరికాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 12 వందల ఏళ్ల నాటి సమాధి తవ్వుతుండగా కోట్లు విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిని చూసిన శాస్త్రవేత్తలంతా షాక్‌కు గురయ్యారయ్యారు. అమెరికాలోని పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద జరుపుతున్న తవ్వకాల్లో ఈ నిధి బయటపడింది. సమాధిలో తవ్వకాల్లో భాగంగా బంగారు నిధితో పాటుగా చాలా వరకు మానవ అవశేషాలను కూడా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి ఈ సమాధి తెలియజేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చారిత్రక సంస్కృతిని ఆవిష్కరిస్తోందని వారు వెల్లడించారు. సమాధిలో బంగారం, మానవ అవశేషాలతో పాటుగా శాలువా, బెల్టులు, తిమింగళం పళ్లతో చేసిన చెవిపోగులు, విలువైన వస్తువులు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. అయితే.. భారీ సమాధిని గుర్తించినట్లు చెప్పారు. ఇందులో ఏకంగా 32 మంది వరకు అవశేషాలను గుర్తించామని అన్నారు. అంతేకాదు.. శాస్త్రవేత్తలు తవ్విన సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా భావిస్తున్నారు.
కోకల్ సంస్కృతికి చెందిన ప్రభువుతో పాటుగా అప్పటి ఆచారం ప్రకారం సమాధిని పూడ్చారని అనుకుంటున్నారు. ఆచారం ప్రకారం 32 మందిని బలి ఇచ్చి.. విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఇక 32 మంది అవశేషాలు ఉండొచ్చు అనేది అంచనా మాత్రమే అనీ.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పురావస్తు శాఖ డైరెక్టర్ జూలియా తెలిపారు. ఇక సమాధిలో దొరికిన బంగారం విలువు కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాధిలో దొరికిన నిధి కచ్చితమైన విలువను త్వరలోనే వెల్లడించనున్నారు.