ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరోలో చోటు చేసుకుంది.
రైలు.. నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెలుతుండగా కల్యుబ్ నగరంలోని స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. 20 అంబులెన్స్‌లను ఘటనాస్థలానికి పంపించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఈజిప్టు రవాణా మంత్రి కమెల్ ఎల్-వజీర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలుసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఈజిప్ట్‌లో రైలు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నిర్వహణ లోపం, పరికరాల జాప్యం వంటి కారణంగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి. 2021లో దక్షిణ ఈజిప్టు నగరమైన తహతాలో రెండు రైళ్లు ఢీకొనడంతో 32 మంది మరణించారు. మరుసటి ఏడాది కల్యుబియా ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పడంతో 11 మంది మరణించారు.
ఈజిప్టులో ఇప్పటి వరకు జరిగిన రైలు ప్రమాదాల్లో 2022లో జరిగిన ప్రమాదం అత్యంత ఘోరమైంది. కైరో నుండి దక్షిణ ఈజిప్ట్‌కు రాత్రిపూట ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగడంతో 300 మందికి పైగా మరణించారు.