నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రాముఖ్యత ఇదే
ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
By అంజి Published on 8 March 2024 11:03 AM ISTనేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రాముఖ్యత ఇదే
ఆవనిలో సగం ఆకాశంలో సగమైన మహిళలకు నేడు ఓ ప్రత్యేక రోజు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, స్నేహితురాలిగా, సహోద్యోగిగా మన చుట్టూ ఉండే మహిళలు చేస్తున్న కృషికి ప్రశంసలు అందించే రోజే ఈ 'ఉమెన్స్ డే'. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉమెన్స్ డే వెనుక ఉన్న చరిత్ర ఏంటో కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మహిళా దినోత్సవం పుట్టుక
ఈ ఉమెన్స్ డేకు సుమారు 115 సంవత్సరాల చరిత్ర ఉంది. 1908 కాలంలో మహిళలు ఎక్కువ పని గంటలకు.. తక్కువ వేతనాలు పొందేవారు. అలాగే ఓటు హక్కు కూడా ఉండేది కాదు. దీంతో మహిళలు తమకూ సమాన హక్కుతో పాటు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం పోరాడారు. దీంతో 1909 సంవత్సరం అమెరికాలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు
ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని అంతర్జాతీయ శ్రామిక మహిళలల సదస్సులో క్లారా అనే ఓ మహిళ సూచించడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత వచ్చింది. దీంతో 1975 ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించి, ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం మొదలు పెట్టింది.
ఉమెన్స్ డే ప్రాముఖ్యత
ప్రపంచంలో పురుషులతో పాటే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. అలా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్త్రీలను గౌరవించడమే ఈ రోజు ప్రత్యేకత. అంతేకాకుండా సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించి, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకు ప్రతి ఏడాది ఒక థీమ్‌ను తీసుకుంటారు. ఈ 2024గానూ 'ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్' అనే థీమ్‌తో ఉమెన్స్ డేను నిర్వహించుకుంటున్నారు.
ఉమెన్స్ డేను ఎలా జరుపుకోవాలి
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, స్నేహితురాలిగా, సహోద్యోగిగా మీ చుట్టూ ఉన్న మహిళలకు మీ సహకారం అందించండి. వారు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ.. బహుమతులు లేదా మెసేజ్ చేసి వారిని సంతోషపరచండి.