ఇప్పటికీ ఎయిర్‌పోర్టు లేని దేశాలు ఉన్నాయని తెలుసా?
These Five Countries Have No Airport for Air Travel. ఒకప్పుడు సంపన్నుల కోసమే అనేలా ఉన్నా విమాన ప్రయాణం.. నేడు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది.
By అంజి Published on 3 Aug 2022 6:21 PM ISTఒకప్పుడు సంపన్నుల కోసమే అనేలా ఉన్నా విమాన ప్రయాణం.. నేడు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. దూరప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఎంచక్కా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానాన్ని ఎక్కేస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో అసలు ఎయిర్‌పోర్టులే లేవు. పైగా ఎయిర్‌పోర్టులు లేని ఆ దేశాలన్నీ యూరప్ ఖండంలోనే ఉన్నాయి.
వాటికన్ సిటీ
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం. 109 ఎకరాల్లో ఈ దేశం విస్తరించి ఉంది. క్రైస్తవ మత గురువు పోప్ వాటికన్ సిటీ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వెయ్యిలోపు జనాభా ఉండే ఈ వాటికన్ సిటీకి ఎయిర్‌పోర్టు లేదు. కానీ 20 కి.మీ దూరంలో రోమ్‌లోని సియాంపినో ఎయిర్‌పోర్టు, ఫిమిసినో ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గన వాటికన్ సిటీకి వెళ్లొచ్చు.
శాన్ మారినో
ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో శాన్ మారికో ఒకటి. ఇక్కడ దాదాపు 40 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇటలీకి ఉత్తరం వైపు ఈ దేశం ఉంది. ఈ దేశంలో కూడా ఎయిర్‌పోర్టు లేదు. ఇటలీలోని రిమిని, బొలొగ్నా నగరాల్లోని ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శాన్ మారినో చేరుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు ఎమర్జెన్సీ హెలీప్యాడ్‌లు, ఒక ఎయిర్‌ఫీల్డ్ ఉంది.
అండోరా
అండోరా దేశం.. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్యలో ఉంది. పైరినీస్ పర్వత శ్రేణి, లోయలు ప్రకృతి అందాలు ఈ దేశం సొంతం. 1982లో ఇక్కడ ఒక ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేశారు. కానీ 1984 నుంచి కమర్షియల్ ఫ్లైట్‌లకు అనుమతి నిరాకరించారు. 2008 వరకు ప్రైవేట్ విమానాలకు మాత్రమే అనుమతించారు. ఆ తర్వాత ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను మూసివేశారు. తిరిగి 2015 నుంచి టూరిస్ట్ చార్టెడ్ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్యులు అండోరా వెళ్లాలంటే ఫ్రాన్స్ లేదా స్పెయిన్‌లోని ఎయిర్‌పోర్టులో దిగి.. రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంటుంది.
మొనాకో
మొనాకో దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో రెండవది. ఈ దేశానికి మూడు వైపులా ఫ్రాన్స్, ఒక వైపు మధ్యధరా సముద్రం ఉంది. ప్రపంచంలోనే అధిక జనసాంద్రత కలిగిన దేశం మొనాకో. ఇక్కడ దాదాపు 40 వేల మంది జనాభా ఉన్నారు. ఈ దేశంలో ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ లేదు. ఫ్రాన్స్‌లోని కొట్ డిఅజుర్ ఎయిర్‌పోర్టు నుంచి 30 నిమిషాల్లో మొనాకోకు చేరుకోవచ్చు.
లిచెన్‌స్టైన్
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్యలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న దేశం లెచెన్‌స్టైన్. ఈ దేశంలో కూడా ఎయిర్‌పోర్టు లేదు. ఇక్కడి వచ్చేవారు సమీపంలోని స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియా ఎయిర్‌పోర్టు ద్వారా రావాల్సి ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్ - ఆల్టెన్రిన్ ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గం లేదా పడవల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆస్ట్రియా నుంచి రైలులో కూడా లిచెన్‌స్టైన్‌కు వెళ్లొచ్చు. లిచెన్‌స్టైన్ దేశం లాస్ ఏంజిల్స్ నగరం కంటే దాదాపు 8 రేట్లు చిన్నది. ఇక్కడ 6 వేల మంది నివసిస్తున్నారు.