టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతం.. ఐదుగురు జలసమాధి

అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉన్న శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌

By అంజి  Published on  23 Jun 2023 10:30 AM IST
US Coast Guard, Titan submersible, OceanGate, Titanic Ship

టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కథ విషాదాంతం.. ఐదుగురు జలసమాధి

అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఉన్న శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ పేలిపోయింది. తీవ్రమైన ఒత్తిడి వ్ల టైటాన్‌ పేలిపోయిందని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రకటన చేసింది. దీంతో టైటాన్‌లో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారు. టైటాన్‌ను వెలికి తీసేందుకు సముద్ర గర్భంలోకి పంపిన రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్‌ సహాయంతో.. మునిగిన టైటానిక్‌ నౌక సమీపంలో కొన్ని టైటాన్‌ శకలాలు కనిపించాయి. టైటానిక్‌ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్‌ శకలాలు గుర్తించినట్లు అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌ తెలిపింది.

టైటాన్‌ మినీ సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న తమ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి స్టాక్టన్‌ రష్‌, ఆయనతోపాటు వెళ్లిన షెహ్జాదా దావూద్‌, సులేమాన్‌ దావూద్‌, హమీష్‌ హర్డింగ్‌, పాల్‌ హెన్రీ నార్గెలెట్‌ ప్రాణాలతో లేరని ఓషన్‌గేట్‌ ఎక్స్‌పెడిషన్స్‌ సంస్థ ప్రకటించింది. టైటాన్‌ ప్రమాదానికి గురైందని తెలియడంతో సెర్చ్‌ ఆపరేషన్‌ ఆపేశారు. తన సిబ్బందిని అమెరికా కోస్ట్‌గార్డ్‌ వెనక్కి పిలిపించింది. తమ బంధువులు కూడా మరణించినట్లు ఆ ఐదుగురి కుటుంబాలు ప్రకటనలు చేశాయి. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.

అయితే ప్రమాదానికి కారణమైన పేలుడు ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ సబ్‌మెర్సిబుల్‌ శిథిలాలు సముద్రపు అట్టడుగున కనిపించాయని కోస్ట్‌గార్డ్‌ తెలిపింది. ఆదివారంనాడు టైటాన్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయిన కొద్దిసేపటికి తమకు పేలుడులాంటి శబ్ధాలు వినిపించాయని యూఎస్ నేవీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. చివరకు ఆ శబ్ధాలు సమీపంలో ఉన్న నౌకల నుంచి వచ్చాయని నిపుణులు తేల్చారు. ఆ తర్వాత గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ కోసం అమెరికా, కెనడా రక్షణ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట టైటాన్‌ శబ్దాలు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దించారు. అయితే గల్లంతైన సబ్‌మెర్సిబుల్‌ తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికన్‌ కోస్ట్‌గార్డ్‌ నిర్ధారించింది. కాగా, ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు. టైటాన్ ప్రమాదంలో ఐదుగురు యాత్రికులు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ‘‘చనిపోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story